Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ.. అదే పెద్ద మైనస్

Peddi Movie Review: ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’.

Naresh.k
Updated on: 4 Jun 2026 10:33 AM IST
Peddi Movie Review
X

Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ.. అదే పెద్ద మైనస్

Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ వంటి పరాజయం తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం, ‘ఉప్పెన’ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘పెద్ది’పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తెలుగు సినిమా ఇది. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం!

కథ

గుర్తింపు కోసం, తన ఊరి గౌరవం కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ‘పెద్ది’ కథ. 2016 ఒలింపిక్స్‌లో భారత్‌కు కేవలం రెండు పతకాలే రావడంతో క్రీడా శాఖ మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వచ్చే పోటీల నాటికి ప్రతిభ గల క్రీడాకారులను వెతకాల్సిందిగా ఆదేశిస్తారు. ఈ క్రమంలో ఓ అధికారి (బొమన్ ఇరానీ) విజయనగరం వస్తాడు. అక్కడ అతనికి ‘పెద్ది’ (రామ్ చరణ్) గురించి తెలుస్తుంది. అసలు పెద్ది ఎవరు? అతను తన ఊరి కోసం ఎలాంటి పోరాటం చేశాడు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ

సినిమా ప్రారంభంలో కేజీయఫ్ తరహాలో హీరో పాత్రను ఇతరుల ద్వారా ఎలివేట్ చేస్తూ ముక్కలు ముక్కలుగా చెప్పడం కొంచెం రొటీన్‌గా అనిపిస్తుంది. దీనివల్ల మొదట్లో కథ కాస్త నెమ్మదించినట్లు ఉంటుంది. అయితే, రామ్ చరణ్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సిక్సర్ కొట్టినప్పటి నుంచి కథనంలో వేగం పెరుగుతుంది. ఒకవైపు పెద్ది క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూనే, మరోవైపు అప్పల సూరి (జగపతి బాబు) పాత్ర ద్వారా ఊరి సమస్యను, అసలు సంఘర్షణను దర్శకుడు చక్కగా చూపించాడు. అయితే, హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) ఎంట్రీ, లవ్ ట్రాక్, ముద్దు సీన్లు అంతగా ఆకట్టుకోవు. అసలు కథతో ఈమె పాత్రకు పెద్దగా సంబంధం లేనట్లు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్‌తో కథ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా ప్లాన్ చేశాడు.

ద్వితీయార్థంలో దర్శకుడు కమర్షియల్ హంగుల కంటే చెప్పాలనుకున్న పాయింట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇందులో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. కుస్తీ పోటీలు జరుగుతున్న సమయంలో వచ్చే కీలక మలుపు కథను మరింత రసవత్తరంగా మారుస్తుంది. ఢిల్లీ ఎపిసోడ్ ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా లేకపోయినప్పటికీ, ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ఆటల పరంగా దర్శకుడు కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ, తెరపై అవి సహజంగానే అనిపిస్తాయి. ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా పూర్తి ఎమోషనల్ నోట్‌లో సాగుతుంది. కథ కాస్త ఊహకందేలా సాగడం ఈ సినిమాకు ప్రధాన మైనస్.

నటీనటుల ప్రతిభ

రామ్ చరణ్ ఈ సినిమాకు ప్రాణం పోశాడు. క్రికెటర్, కుస్తీ యోధుడు, రన్నర్.. ఇలా మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుతమైన వేరియేషన్ చూపించాడు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్: అప్పల సూరి పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయారు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పూర్తి న్యాయం చేశారు. అచ్చియమ్మగా జాన్వీ స్క్రీన్‌పై చాలా అందంగా కనిపించింది. కానీ, ఆమె పాత్ర పరిధి తక్కువే. కొన్ని చోట్ల నటన కాస్త అతిగా అనిపించినా, ఉన్నంతలో మెప్పించింది. దివ్యేందు, బొమన్ ఇరానీ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం

సాంకేతికంగా సినిమా టాప్ నాచ్‌లో ఉంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్స్‌ను, ఎలివేషన్స్ ని తన సంగీతంతో మరింత లేపారు. పాటలు కూడా బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను రిచ్‌గా చూపించి, సినిమా స్థాయిని పెంచింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో, అద్భుత నటన

ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం

సెకండాఫ్ లో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఎమోషన్స్

రత్నవేలు విజువల్స్

మైనస్ పాయింట్స్:

ఊహకందేలా సాగే రొటీన్ కథనం

బలహీనమైన హీరోయిన్ ట్రాక్

ప్రారంభంలో కేజీయఫ్ తరహా నరేషన్ స్లోగా అనిపించడం

ఫైనల్‌గా

‘పెద్ది’.. పక్కా ఎమోషనల్ అండ్ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా. కథలో కొత్తదనం లేకపోయినా, రామ్ చరణ్ అద్భుత నటన, రెహమాన్ సంగీతం కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో హ్యాపీగా చూడొచ్చు. స్పోర్ట్స్ , ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే వారికి ‘పెద్ది’ ఒక మంచి ఛాయిస్.

రేటింగ్: 3.5/5

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story