Gruhalakshmi: సినిమాల్లో రియాలిటీ అంటే ఇదే... షూటింగ్ అని తెలియక జనం ఏం చేశారంటే
1938లో వచ్చిన గృహలక్ష్మీ క్లైమాక్స్ సీన్‌ని చిత్రీకరించేందుకు దర్శకుడు హెచ్‌ఎమ్ రెడ్డి ఎంచుకున్న ప్రయోగం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. జనాలు ఆశ్చర్యపోయేలా చేసింది.
Gruhalakshmi: ఈనాటి సినిమాల్లో రియలిస్టిక్ లుక్ కోసం లొకేషన్లలో రహస్యంగా కెమెరాలు పెట్టి 'క్యాండిడ్' షాట్లు తీయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ సరిగ్గా 88 సంవత్సరాల క్రితం, అంటే 1938లోనే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడు ఇటువంటి సాహసవంతమైన ప్రయోగం చేశారు. నాటి ప్రముఖ నిర్మాణ సంస్థ 'రోహిణి పిక్చర్స్' పతాకంపై ప్రసిద్ధ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'గృహలక్ష్మి'. ఈ సినిమాలో మహానటి కన్నాంబ కథానాయికగా నటించారు. ఆ రోజుల్లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
మద్రాసు వీధుల్లో అసలైన డ్రామా!
'గృహలక్ష్మి' సినిమా చివరి ఘట్టంలో నాయిక మానసిక సమతుల్యత కోల్పోయి పిచ్చిదైపోతుంది. "దేవుడు లేడు! సత్యం జయించదూ!" అని గట్టిగా అరుస్తూ రోడ్డుపై పరుగులు తీయడం ఆ సన్నివేశం సారాంశం. ఈ సీన్ కోసం దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి మద్రాసులోని రద్దీగా ఉండే 'జార్జ్ టౌన్' వీధులను ఎంచుకున్నారు. ఆ రోజుల్లో రోడ్ల మీద షూటింగ్ చేయాలంటే ప్రత్యేకంగా పోలీసు అనుమతులు తీసుకోవాల్సిన నిబంధనలు లేవు. దాంతో జనం మధ్య సాధారణ వాతావరణంలో సీన్ తీయాలని నిర్ణయించారు. వీధి ఒక చివరన జనానికి కనిపించకుండా కెమెరాను దాచిపెట్టారు. డైరెక్టర్ 'యాక్షన్' చెప్పగానే కన్నాంబ చెదిరిన జుట్టుతో, పీక్కుపోయిన బట్టలతో జనాలను తోసుకుంటూ, గుర్రపు బళ్ళు, కార్లను తప్పించుకుంటూ రోడ్డుపై పరిగెత్తడం ప్రారంభించారు.
జనం స్పందన ... నటిని కాపాడిన బాటసారులు!
ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు సినిమా షూటింగ్‌ల గురించి, కెమెరాల పనితీరు గురించి అస్సలు అవగాహన ఉండేది కాదు. రోడ్డు పక్కన కెమెరా ఉందనే విషయం ఎవరూ గమనించలేదు. ఏ ఆధారం లేని ఒక మహిళ పిచ్చిపట్టినట్లు అరుస్తూ రోడ్డు మీద పగలు పరిగెడుతుంటే, ఎవరైనా జట్కా బండి కిందో లేదా కారు కిందో పడి ప్రాణాలు పోగొట్టుకుంటుందేమోనని చుట్టుపక్కల బాటసారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే కొందరు చొరవ తీసుకుని ఆమెను పట్టుకుని, బలవంతంగా రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఒక మూలన కూర్చోబెట్టారు. ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా వెనుక ఉన్న చిత్రయూనిట్, దర్శకుడు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. "ఇది సినిమా షూటింగ్... ఆమె పిచ్చిది కాదు, నటి కన్నాంబ" అని వివరించి చెప్పిన తర్వాత కానీ జనం ఆమెను వదలిపెట్టలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, అంత సహజంగా నటించిన కన్నాంబ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. తెరపై ఆ సన్నివేశం వచ్చినప్పుడు ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చూశారంటే, ఆ రోజు జనం చూపించిన ఆ అమాయకత్వమే ఆ సీన్‌కి ప్రాణం పోసిందని చెప్పవచ్చు.




