72nd National Film Awards : జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా.. 'కమిటీ కుర్రాళ్లు'కు బెస్ట్ ఫిలిం అవార్డు.!
72nd National Film Awards : తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ స్థాయిలో మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో
72nd National Film Awards
72nd National Film Awards : తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ స్థాయిలో మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (72nd National Film Awards) ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా (Best Telugu Film) ‘కమిటీ కుర్రాళ్ళు’ అవార్డును కైవసం చేసుకుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ , శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై యువ దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం జాతీయ జూరీని ఎంతగానో మెప్పించి ఈ ఘనత సాధించింది. పల్లెటూరి నేపథ్యం, స్నేహం, సామాజిక అంశాల కలబోతగా 2024లో వచ్చిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు దక్కడంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.
మెగా డాటర్ నిర్మాణంలో.. కొత్త నటీనటులతో సంచలనం
నిర్మాతగా నిహారిక కొణిదెల ఎంచుకున్న వైవిధ్యమైన కథే ఈ విజయానికి ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న నటీనటుల వెంట పడకుండా, దాదాపు అందరూ కొత్తవారితోనే దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే స్నేహితుల బంధాన్ని, వారి మధ్య వచ్చే మనస్పర్థలను, స్థానిక రాజకీయాలను ఎంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా తెరపై ఆవిష్కరించారు. కథలోని నిజాయితీ, నటీనటుల సహజ నటన, అద్భుతమైన సంభాషణలు ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చేలా చేశాయి. అంతేకాకుండా.. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డును తెలుగు సినిమా కేటగిరీలో కమిటీ కుర్రాళ్ళకి గాను పి రవికుమార్ గెలుచుకున్నారు.
అవార్డు రావడంపై చిత్ర యూనిట్ ఆనందం
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడంపై నిర్మాత నిహారిక కొణిదెల , దర్శకుడు యదు వంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక మంచి కథను నమ్మి కొత్తవారితో చేసిన ప్రయత్నానికి లభించిన అతిపెద్ద గుర్తింపు ఇదని చిత్ర యూనిట్ పేర్కొంది. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ జాతీయ అవార్డుతో తెలుగు సినిమా ఖ్యాతి మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగింది.




