Aamir Khan: భారీ బయోపిక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ఆమిర్ ఖాన్!
Aamir Khan: ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అనూహ్యంగా తప్పుకున్నారు.
Aamir Khan: భారీ బయోపిక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ఆమిర్ ఖాన్!
Aamir Khan: ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అనూహ్యంగా తప్పుకున్నారు. దర్శకుడితో తలెత్తిన సృజనాత్మక విభేదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అష్నీర్ గ్రోవర్ బయోపిక్ పై మొదలైన ఆసక్తి
ఈ ఏడాది ప్రారంభంలో, భారతీయ వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ స్టార్టప్ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ జీవిత కథను సినిమాగా మలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్ తీవ్ర ఆసక్తి కనబరిచారని, ఆయన ప్రధాన పాత్రలో నటించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అష్నీర్ గ్రోవర్ సాధించిన విజయాలు, ఆయన ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగించే అంశాలు కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. యువ దర్శకుడు రాహుల్ మోడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, ఆమిర్ కు జోడీగా ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై అప్పట్లో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రాజెక్టు నుంచి ఆమిర్ ఖాన్ నిష్క్రమణ
కథా చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఒక సంచలన వార్త తెరపైకి వచ్చింది. సృజనాత్మక విభేదాల కారణంగా ఆమిర్ ఖాన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. స్టార్టప్ ప్రపంచం నేపథ్యంగా సాగే ఈ కథపై ఆయన ఎంతో మక్కువ చూపించారు. ప్రతి సినిమాకు ఎంతో సమయం కేటాయించి పక్కాగా ప్లాన్ చేసుకునే ఆమిర్, ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ అభివృద్ధిలో కూడా చుకురుగా పాలుపంచుకున్నారు. కానీ, అంతిమంగా దర్శకుడు రాహుల్ మోడీ ఆలోచనలతో కథాపరంగా కొన్ని విభేదాలు తలెత్తడంతో ఆయన ఈ సినిమా నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
రాహుల్, శ్రద్ధా కపూర్ తదుపరి ప్రణాళికలు
ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ, దర్శకుడు రాహుల్ మోడీ, నటి శ్రద్ధా కపూర్ మాత్రం ఈ సినిమాను ఎలాగైనా తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజ జీవితంలో ప్రేమలో ఉన్న ఈ జంట, ప్రాజెక్టును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అష్నీర్ పాత్ర కోసం మరో యువ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ప్రస్తుతం బాలీవుడ్ కు చెందిన ఇద్దరు, ముగ్గురు అగ్ర నటులతో చురుకుగా చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే హీరో ఎవరనేది అధికారికంగా ఖరారు చేస్తారని సమాచారం.
నిర్మాతగా మారనున్న శ్రద్ధా కపూర్.. తాజా అప్డేట్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అభివృద్ధి దశలో ఉన్న ఈ బయోపిక్ నిర్మాణంలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి నటి శ్రద్ధా కపూర్ కూడా పాలుపంచుకోనున్నారు. ఈ చిత్రంలో ఆమె అష్నీర్ సతీమణి పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా పంచుకోనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రేక్షకులకు అధికారికంగా వెల్లడి కానున్నాయి.




