CJP Protest: సీజేపీ ధర్నాలో ఉద్రిక్తత.. పోలీసుల ప్రవర్తనపై ఆమిర్‌ ఖాన్‌ మేనకోడలు సంచలన ఆరోపణలు..

CJP Protest: ముంబైలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో అరెస్టయిన ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేశారు.

Arun Chilukuri
Published on: 12 Oct 2026 12:32 PM IST
CJP Protest
X

CJP Protest: సీజేపీ ధర్నాలో ఉద్రిక్తత.. పోలీసుల ప్రవర్తనపై ఆమిర్‌ ఖాన్‌ మేనకోడలు సంచలన ఆరోపణలు..

CJP Protest: ముంబైలోని చారిత్రాత్మక ఆగస్ట్‌ క్రాంతి మైదాన్‌ వేదికగా జరిగిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్‌ మేనకోడలు, నటి జైన్‌ మేరీతో పాటు మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌ కూడా పాల్గొన్నారు. ఈ నిరసన సమయంలో పోలీసులు తన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారంటూ జైన్‌ మేరీ తాజాగా ఒక వీడియోను విడుదల చేయడం కలకలం రేపింది.

నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు తమపై బలప్రయోగం చేశారని జైన్‌ మేరీ ఆరోపించారు. ఈ సందర్భంగా తనకు పోలీసుల నుంచి ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ, తన శరీరానికి తగిలిన గాయాలను వీడియోలో స్పష్టంగా చూపించారు. ‘‘మమ్మల్ని ఎక్కువగా భయపెట్టాలని చూడకండి. ఇలాంటి చర్యలతో మాలో అసలు భయమనేదే లేకుండా పోతుంది’’ అంటూ ఆమె గట్టిగా హెచ్చరించారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సీజేపీ ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో పాల్గొన్న జైన్‌ మేరీతో పాటు ఇమ్రాన్ ఖాన్‌ను కూడా ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక వ్యాన్‌లో పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, విచారణ అనంతరం కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు.

మరోవైపు, ఈ నిరసనలో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బీజేపీ సీనియర్ నాయకుడు కిరీట్‌ సోమయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ అసంపూర్ణంగా ఉందని ఆయన ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (OCI) హోదా కలిగిన విదేశీ పౌరుడని, ఆయన నిరసనల్లో పాల్గొనడం ద్వారా వీసా నిబంధనలను ఉల్లంఘించారని కిరీట్‌ సోమయ్య పేర్కొన్నారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై ఇమ్రాన్‌ఖాన్‌పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.