మరో వివాదంలో ఆమిర్ ఖాన్.. 'లవ్ జిహాద్' అంటూ మంటలు!

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఇటీవలే గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు.

Srinivas Rao
Published on: 13 July 2026 12:12 PM IST
Aamir Khan
X

మరో వివాదంలో ఆమిర్ ఖాన్.. 'లవ్ జిహాద్' అంటూ మంటలు! 

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఇటీవలే గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని ఆయన నివాసంలో జరిగిన ఈ వివాహం అత్యంత ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అయితే, ఈ పెళ్లి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

వివాదానికి దారితీసిన వ్యాఖ్యలు..

ఆమిర్ ఖాన్ మూడో వివాహంపై బిజెపి నేత, మంత్రి నితేష్ రాణే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ సమాజం ఇలాంటి సెలబ్రిటీలను ఆదరించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. "ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, హిందూ సమాజం తప్పకుండా ఆలోచించాలి. ఆమిర్ ఖాన్ 'లవ్ జిహాద్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్నారా? ఆయన సినిమాలు చూసే హిందూ యువత, ఇలాంటి వారిని స్టార్లను చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి," అని రాణే వ్యాఖ్యానించారు.

వ్యతిరేకత ఎందుకు?

కొద్దిరోజుల క్రితం బీహార్‌లోని బజరంగ్ దళ్ సభ్యులు ఆమిర్ ఖాన్‌పై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ, ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతీశారని వారు ఆరోపించారు. వీటన్నింటికీ తోడు నితేష్ రాణే వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వివాదాన్ని మరింత వేడిక్కించాయి. అయితే, ఈ ఆరోపణలపై ఆమిర్ ఖాన్ ఇంతవరకు ఎటువంటి అధికారిక స్పందన తెలపలేదు.

కెరీర్ పరంగా…

వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఎదురవుతున్నప్పటికీ, వృత్తిపరంగా ఆమిర్ ఖాన్ బిజీగా ఉన్నారు. ఆయన నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ‘బట్వారా 1947’ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ డియోల్, ప్రీతి జింటా, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, అదే రోజు విడుదల కానున్న ఎమ్రాన్ హష్మీ ‘అవారపన్ 2’తో బాక్సాఫీస్ వద్ద తలపడనుంది.

ఇక మరోవైపు, ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా రూపొందుతున్న ‘సిల్క్యారా 41’ ప్రాజెక్టును కూడా ఆమిర్ ఖాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story