Aankhen Story: ధురంధర్‌కు ఆ సినిమానే ప్రేరణ... 1968లోనే సంచలన విజయం
Aankhen Story: ప్రస్తుతం సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ ధురంధర్ 2 యాక్షన్ సీక్వెన్స్‌లు, రణబీర్ కపూర్ రామాయణం టీజర్లు ట్రెండ్ అవుతున్నాయి.
Aankhen Story
Aankhen Story: ప్రస్తుతం సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ ధురంధర్ 2 యాక్షన్ సీక్వెన్స్‌లు, రణబీర్ కపూర్ రామాయణం టీజర్లు ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఆధునిక స్పై సినిమాలకు పునాది వేసిన సినిమా, నేటి పౌరాణిక గాథలకు ప్రాణం పోసిన దర్శకుడు ఎవరు అంటే మనకు గుర్తుకు వచ్చే పేరు రామానంద్ సాగర్. 80వ దశకంలో రామాయణం సీరియల్‌తో ఇంటింటి దేవుడైన ఆయన అంతకు ముందే 1968లో ఆంఖే అనే సినిమాతో ఇండియన్ బాండ్ సినిమాలకు గ్రామర్ నేర్పించాడు. ఆ తరువాత వచ్చిన బాండ్ సినిమాలకు ఆంఖే స్పూర్తిగా నిలిచింది.
చంద్రమౌళి నుంచి రామానంద్ సాగర్ వరకు..
రామానంద్ సాగర్ అసలు పేరు చంద్రమౌళి చోప్రా. ఒకప్పుడు క్లాపర్ బాయ్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, రాజ్ కపూర్ 'బరసాత్'కు రచయితగా మారి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని మలుపు తిప్పారు. 1964లో 'ఆర్జూ' వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాక, జేమ్స్ బాండ్ తరహాలో ఒక దేశభక్తి గూఢచారి కథను తీయాలని సంకల్పించారు.
ధర్మేంద్రను స్పై హీరోగా మార్చిన 'ఆంఖే'
ఈ స్పై సినిమా కోసం ఆయన ధర్మేంద్రను ఎంచుకున్నారు. భారత నిఘా సంస్థ 'రా' ఏర్పడిన 1968లోనే ఈ సినిమా విడుదల కావడం విశేషం. ఆ కాలంలోనే ఈ సినిమా షూటింగ్‌ను లెబనాన్, ఇరాన్ వంటి దేశాల్లో చిత్రీకరించారు. టెహ్రాన్ వీధుల్లో షూటింగ్ జరిపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించారు. సాధారణంగా స్పై సినిమాల్లో పాకిస్తాన్‌ను విలన్‌గా చూపించడం పరిపాటి. కానీ, ఆ రోజుల్లో చైనా కుట్రలను అడ్డుకునే గూఢాచారుల కథను ఆయన తెరకెక్కించారు. అంతేకాదు, ఈ సినిమాలో ధర్మేంద్ర నిజమైన పులితో పోరాడే సన్నివేశం అప్పట్లో ఓ సంచలనంగా చెప్పవచ్చు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి వావ్ అనిపించారు.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం
1968 ప్రాంతంలో 85 లక్షల రూపాయల బడ్జెట్‌తో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆరోజుల్లో ఇది భారీ బడ్జెట్. కానీ, నిర్మాతలు కథపై నమ్మకంతో సినిమాను నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో దాదాపు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నేటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది వందల కోట్లతో సమానం. ఈ స్పై సినిమా పలు థియేటర్లలో 75 వారాలపాటు ఆడి డైమండ్ జూబ్లీ రికార్డు సృష్టించింది. దేశ సరిహద్దులను ఎవరూ తాకలేరు. ఎందుకంటే దానికి కాపలాగా ఆంఖే ఉన్నాయి అనే డైలాగ్ జనాలను ఉర్రూతలూగించింది.
నేడు నితేష్ తివారీ 4,000 కోట్ల రూపాయలతో 'రామాయణం' నిర్మిస్తున్నా, దానికి ప్రామాణికం మాత్రం రామానంద్ సాగర్ తీసిన నాటి పాత రామాయణమే. ఒకవైపు గూఢచారి కథతో మాస్ జేమ్స్ బాండ్‌ను చూపించి, మరోవైపు పౌరాణిక గాథతో దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తడం కేవలం రామానంద్ సాగర్‌కే సాధ్యమైంది. నేటి 'ధురందర్' లాంటి స్పై సినిమాలకు 'ఆంఖే' ఒక స్పూర్తి అని చెప్పవచ్చు.




