బికినీ ఫొటోలపై నిప్పులు చెరిగిన రుక్మిణి వసంత్!
కథానాయకి రుక్మిణి వసంత్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న కొన్ని అభ్యంతరకరమైన బికినీ విజువల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతకంటే ప్రమాదకరంగా దాని దుర్వినియోగం మారుతోంది. తాజాగా సినీ పరిశ్రమలో మరో నటి కృత్రిమ మేధస్సు (AI) సృష్టించిన డీప్‌ఫేక్ మాయాజాలానికి బలయ్యారు. కన్నడ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి రుక్మిణి వసంత్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న కొన్ని అభ్యంతరకరమైన బికినీ విజువల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై నటి శనివారం అత్యంత ఘాటుగా స్పందిస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
బాధ్యతారాహిత్యం… వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన
రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ వద్ద పచ్చటి బికినీ ధరించి ప్రొఫెషనల్ ఫొటోషూట్‌లో పాల్గొన్నట్లు కొన్ని చిత్రాలు, వీడియో క్లిప్‌లు ఆన్‌లైన్ వేదికగా దర్శనమిచ్చాయి. అది నిజమైన ఫొటోషూట్ అని నమ్మి చాలా మంది నెటిజన్లు ఆ కంటెంట్‌ను విపరీతంగా షేర్ చేశారు. ఈ తీవ్రమైన అంశాన్ని గుర్తించిన రుక్మిణి వసంత్ తన ఎక్స్ (ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా అసలు నిజాన్ని బయటపెట్టారు.
ఆ ఫొటోలు, వీడియోలు అన్నీ ముమ్మాటికీ నకిలీవని ఆమె స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు సాయంతో అసభ్యకర రీతిలో తన రూపాన్ని మార్చి, ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఇది ఒకరి వ్యక్తిగత గోప్యతను దారుణంగా భంగపరచడమే అవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు
ఈ తప్పుడు ప్రచారాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు రుక్మిణి వెల్లడించారు. ఈ మార్చబడిన విజువల్స్‌ను క్రియేట్ చేసిన వారితో పాటు, వాటిని ఆన్‌లైన్ వేదికగా ఇతరులకు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్న వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ లీగల్ టీమ్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు, దోషులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎవరూ ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను ఇతరులతో పంచుకోవద్దని, వాటిని లైక్ చేయడం లేదా ప్రోత్సహించడం మానుకోవాలని ఆమె ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు.
నటీమణులకు శాపంగా మారుతున్న డీప్‌ఫేక్స్
గతంలో కూడా రష్మిక మందన్న, ఆలియా భట్, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ నటీమణులు ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ సైతం దీనికి బాధితురాలిగా మారడం ఆందోళన కలిగిస్తోంది. సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్‌కు వచ్చినప్పుడు కెమెరాలను వారి శరీర భాగాలపై జూమ్ చేసి వికృత ఆనందం పొందడంపై రుక్మిణి గతంలోనే బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏకంగా కృత్రిమ సాంకేతికతతో ఇటువంటి ఫేక్ కంటెంట్ సృష్టించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇటీవల మరో ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైతం ఇటువంటి ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయడం గమనార్హం.




