Actress Shoba Tragic Story: చేతిలో సూపర్ హిట్ సినిమాలు...కట్ చేస్తే 17 ఏళ్లకే ముగిసిన జీవితం
17 ఏళ్లకే పసి సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న శోభ... చిన్నవయసులోనే మరణించడం పెనువిషాదంగా మారింది
Actress Shoba Tragic Story: సినిమా గ్లామర్ ప్రపంచం బయట నుంచి చూస్తే మెరుపులతో అందంగా కనిపిస్తుంది. కానీ, లోపల మాత్రం ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. చేతి నిండా సినిమాలు, స్టార్ హీరోలతో జోడీలు, అతి పిన్న వయసులోనే 'జాతీయ ఉత్తమ నటి'గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు.. ఇలా ఒక నటికి కావాల్సినవన్నీ కేవలం 17 ఏళ్లకే దక్కాయి. కానీ, ఆ విజయ గర్వం చూసుకోకముందే ఆమె జీవితం ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఆమే వెండితెర సంచలనం శోభ.
బాలనటిగా ఎంట్రీ.. స్టార్‌డమ్ వరకు!
1962లో మద్రాసులో జన్మించిన మహాలక్ష్మి మీనన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత శోభగా మారింది. శోభ నాలుగేళ్ల వయసులోనే కెమేరా ముందుకు వచ్చారు. స్వతహాగా తల్లి మలయాళం నటి కావడంతో సినిమా ఇండస్ట్రీలోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. తమిళం, మలయాళం, కన్నడతో పాటు తెలుగులో చిరంజీవి సరసన 'మన ఊరి పాండవులు' వంటి క్లాసిక్ సినిమాల్లో నటించి మెప్పించారు శోభ. 1978లో వచ్చిన 'ఉత్రాడ రాత్రి' ఆమె కెరీర్‌ను మలుపు తిప్పితే, రజనీకాంత్ సరసన 'ముల్లుమ్ మలరుమ్' ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. వరస హిట్స్ అందుకున్న శోభ కెరీర్ ఒక్కసారిగా స్టార్‌డమ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
17 ఏళ్లకే జాతీయ అవార్డు - ఒక రికార్డు
1979లో విడుదలైన 'పసి' చిత్రం శోభ జీవితంలో మైలురాయి. మురికివాడలో చెత్త ఏరుకునే 'కుప్పమ్మ' పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారు. ఆ నటనకు ఫిదా అయిన జ్యూరీ, ఆమెకు 19 ఏళ్ల లోపు వయసులోనే 'నేషనల్ అవార్డు'ను కట్టబెట్టింది. భారత సినీ చరిత్రలో ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన నటి మరొకరు లేరు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉండటం విశేషం. నటనలో పరిపక్వత సాధిస్తే అవార్డులు అవే సొంతమౌతాయని చెప్పడానికి శోభ ఓ నిదర్శనం.
ప్రేమ.. పెళ్లి.. పెను విషాదం!
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు బాలు మహేంద్రతో శోభ ప్రేమలో పడ్డారు. తనకంటే 26 ఏళ్లు పెద్దవాడు, అప్పటికే పెళ్లైన వ్యక్తి అని తెలిసినా.. తల్లి మాటను ఎదిరించి 1978లో ఆయన్ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ వైవాహిక బంధం ఆమెకు శాంతిని ఇవ్వలేదు. బాలు మహేంద్ర మొదటి భార్యతోనే ఉండటం, శోభను సరిగా పట్టించుకోకపోవడం వంటి కారణాలు ఆమెను మానసిక కుంగుబాటుకు గురిచేశాయి. పెళ్లైనా ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో శోభకు అర్ధమైంది.
అంతుచిక్కని ముగింపు
1980 మే 1వ తేదీన, అవార్డులు తెచ్చిన ఆనందం ఆవిరి కాకముందే.. చెన్నైలోని తన నివాసంలో శోభ విగతజీవిగా కనిపించారు. 18 ఏళ్లు కూడా నిండకుండానే ఆమె తనువు చాలించడం అప్పట్లో సంచలనం. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా తేల్చినా, ఆమె తల్లి మాత్రం బాలు మహేంద్రే హత్య చేశారంటూ ఆరోపణలు చేశారు. ఒక అద్భుతమైన ప్రతిభ.. అపక్వమైన నిర్ణయాల వల్ల అర్ధాంతరంగా ముగిసిపోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. శోభ మరణం నేటికీ సినీ రంగంలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.




