Adarsa Kutumbam: ఫేక్ కలెక్షన్ల పోస్టర్లతో ‘ఆదర్శ కుటుంబం’ వివాదం..!
Adarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ కలెక్షన్ల పోస్టర్లపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తోంది.
Adarsa Kutumbam: ఫేక్ కలెక్షన్ల పోస్టర్లతో ‘ఆదర్శ కుటుంబం’ వివాదం..!
Adarsa Kutumbam Fake Collections: చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాలకు సంబంధించి బాక్సాఫీస్ వసూళ్లను కాస్త అటుఇటుగా పెంచి చూపించడం ఎప్పటినుంచో నడుస్తున్న సంప్రదాయమేనని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. అయితే వాస్తవానికి ఏమాత్రం పొంతన లేని రీతిలో భారీ తేడాలతో పోస్టర్లు వేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా? సరిగ్గా ఇప్పుడిదే అంశం ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చుట్టూ పెద్ద దుమారాన్నే రేపుతోంది.
విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కలెక్షన్లపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ ప్రకటించిన అధికారిక లెక్కలకు, క్షేత్రస్థాయిలో వచ్చిన కలెక్షన్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ నెటిజన్లు లెక్కలతో సహా పోస్టులు పెడుతున్నారు.
సినిమా విడుదలైన తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. నెగెటివ్ టాక్ నడుమ కూడా వెంకీ ఇమేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ బలం వల్లే ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ పోస్టర్ బయటకు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి.
విశ్వసనీయ ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా మొదటి మూడు రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 55 కోట్ల మార్కును కూడా తాకలేదని, వాస్తవ వసూళ్లు కేవలం రూ. 50 కోట్ల సమీపంలోనే ఆగిపోయాయని నెటిజన్లు వాదిస్తున్నారు. అంటే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా అదనంగా కలిపి పోస్టర్లలో ముద్రించారని, 10 - 20 శాతం పెంచితే అభిమానుల కోసం అనుకోవచ్చు కానీ, ఏకంగా 50 శాతానికి పైగా ఫేక్ నంబర్లు వేయడం బాక్సాఫీస్ రిపోర్టింగ్‌ను హాస్యాస్పదం చేయడమేనని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ఇష్టానుసారంగా రిలీజ్ డేట్లు మార్చుకోవడం, ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలకు సైతం అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచడం, తీరా థియేటర్లలో పరిస్థితి తేడా కొట్టగానే అయినకాడికి కలెక్షన్ల అంకెలను పెంచేసి భారీ పోస్టర్లు రిలీజ్ చేయడం చిలిపి చింటుకే చెల్లిందంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు సినిమా ప్రేమికులు విరుచుకుపడుతున్నారు. 60 పరుగులు చేసిన అఖిల్‌తో సెంచరీ చేయించడం, హాఫ్ సెంచరీ చేసిన వెంకీ ఖాతాలో ముప్పావు సెంచరీ వేసేయడం జస్ట్ ఆయనకే సాధ్యం అంటూ సెటైరికల్‌గా మీమ్స్ షేర్ చేస్తున్నారు.
సాధారణంగా సీనియర్ స్టార్ వెంకటేష్ ఎప్పుడూ రికార్డుల వేటలో ఉండరని, ఆయన అభిమానులు కూడా ఫేక్ కలెక్షన్ల పరుగు పందెంలో పాల్గొనరని ఇండస్ట్రీలో ఒక పేరుంది. కలెక్షన్ల పిచ్చి ఉన్న కొందరు హీరోలు, వారి ఫ్యాన్స్ కొట్టుకు చావడం చూశాం కానీ.. ఇలాంటి నంబర్ల గోల ఏమాత్రం పట్టని వెంకటేష్‌ను, ఆయన హుందాతనాన్ని కూడా ఈ అనవసరపు పోస్టర్ల వివాదంలోకి ఎందుకు లాగాల్సి వచ్చిందని పలువురు సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఫ్యాన్స్ కోసం అని చెప్పుకునే ఈ ఫేక్ నంబర్లను చివరకు ఆ అభిమానులు కూడా నమ్మే పరిస్థితి లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రొడక్షన్ హౌస్‌లు ఇలాంటి 'కలెక్షన్ కామెడీ'ని ఆపి సినిమా కంటెంట్‌తో రికార్డులు సృష్టించే ప్రయత్నం చేయాలని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.




