Ajay Ghosh: ఆ ఒక్క సినిమాతోనే ఇల్లు కట్టేశా...పుష్ప తరువాత జీవితం బాగుంది

Ajay Ghosh: సినీ పరిశ్రమలో చిన్న పాత్రలతో ప్రారంభించి, తనదైన నటనతో గుర్తింపు పొందిన నటుడు అజయ్ ఘోష్ తాజాగా తన జీవిత ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Balachander
Published on: 18 April 2026 12:18 PM IST
Ajay Ghosh
X

Ajay Ghosh

Ajay Ghosh: సినీ పరిశ్రమలో చిన్న పాత్రలతో ప్రారంభించి, తనదైన నటనతో గుర్తింపు పొందిన నటుడు అజయ్ ఘోష్ తాజాగా తన జీవిత ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఓ సినిమా తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

స్టార్ హీరోలతో అనుబంధం

సినీ రంగంలో స్టార్‌ హీరోలతో ఎంత అనుబంధం ఉంటే అంతగా రాణిస్తారు. అన్ని అవకాశాలు వస్తాయి. ఒకరిద్దరితో కాకుండా టాప్‌ హీరోలందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఈ విషయాన్ని వంటపట్టించుకున్న అజయ్‌ ఘోష్‌ ప్రతి ఒక్కరితోనూ కలివిడిగా ఉన్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటివారు తనను ఆప్యాయంగా బాబాయ్‌ అని పిలిచేవారని, రామ్‌చరణ్‌ గౌరవంగా పిలిచేవారని చెప్పుకొచ్చారు. ఇక మాస్‌ మహారాజా రవితేజతో కలిసి ఎక్కువ సినిమాలు చేసినట్టు ఆయన తనను తన సొంత బాబాయ్‌లా చూసుకునేవారని చెప్పాడు. రవితేజతో కలిసి పనిచేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఉత్సాహంగా ఉంటుందని, క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలని అనిపిస్తుందని అన్నారు. అయితే, మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రెండు మూడు సార్లు వచ్చినా, డేట్ల సర్దుబాటు కాక కోల్పోవడం తన కెరీర్‌లో అతిపెద్ద దురదృష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రంగస్థలంతో ఇంటి నిర్మాణం

అజయ్ ఘోష్ కోట్ల ఆస్తులు సంపాదించారని, భారీ భవనాలు కట్టారని వస్తున్న వార్తలపై ఆయన స్పష్టత ఇచ్చారు. "నాకు మూడు, నాలుగు అంతస్తుల మేడలు లేవు. సుకుమార్ గారి 'రంగస్థలం' సినిమా పుణ్యమా అని మా ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇటీవల హైదరాబాద్‌లో నా సంపాదన, నా పెద్ద కొడుకు సంపాదన కలిపి ఒక చిన్న ఫ్లాట్ కొన్నాం" అని నిజాయితీగా చెప్పారు. మధ్యతరగతి తండ్రిగా తనకు ఇంతకంటే ఇంకేంకావాలని అన్నారు. తన వృత్తి దయవల్ల తన కుటుంబం ఇబ్బందులు లేకుండా హాయిగా ఉందని, చిన్న కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. వివేక్ ఆత్రేయ, సుజిత్, మారుతి వంటి దర్శకులు తనలోని నటుడిని గుర్తించి మంచి పాత్రలు ఇస్తున్నారని, 'పుష్ప' సినిమా తర్వాత అవకాశాలకు కొదవ లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చిన విజయాలకు పొంగిపోకుండా, వస్తున్న పుకార్లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడమే తన విజయ రహస్యమని అజయ్‌ ఘోష్‌ నిరూపించారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story