Lenin: ఆ సినిమాలో నా నటన చూసి నాకే అసహ్యం వేసింది

Lenin: 'లెనిన్' చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ విజయాన్ని అందుకున్న అఖిల్ అక్కినేని.. 'ఏజెంట్' ఫ్లాప్‌పై తొలిసారి స్పందించారు.

Naresh.k
Published on: 26 July 2026 3:54 PM IST
Lenin
X

Lenin: ఆ సినిమాలో నా నటన చూసి నాకే అసహ్యం వేసింది

Lenin: చిత్రపరిశ్రమలో విజయాలు, ఓటములు సహజమే అయినా.. కొన్ని పరాజయాలు నటుల మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అక్కినేని యంగ్ హీరో అఖిల్‌కు 'ఏజెంట్' చిత్రం సరిగ్గా అలాంటి అనుభవాన్నే మిగిల్చింది. అయితే ఆ చేదు జ్ఞాపకాన్ని పక్కనపెట్టి, ఇటీవల విడుదలైన 'లెనిన్' చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని మళ్లీ ఊపిరి పోసుకున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 'ఏజెంట్' పరాజయంపై, అలాగే తన నటనలోని లోపాలపై అఖిల్ అత్యంత నిజాయితీగా స్పందించడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ 2023లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అఖిల్, తాజాగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిన తర్వాత ఆ సినిమాను మళ్లీ చూశాను. స్క్రీన్ పై నన్ను నేను చూసుకొని నాకే చాలా అసహ్యమేసింది. దాదాపు ప్రతి సన్నివేశంలోనూ నేను చాలా ఓవర్‌గా పెర్ఫార్మ్ చేశానని, అతిగా నటించానని నాకే స్పష్టంగా అర్థమైంది అని అఖిల్ తన నటనలోని లోపాలను ఓపెన్‌గా అంగీకరించారు.

సినిమా థియేటర్లలోకి రాకముందే ఫలితంపై తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని అఖిల్ వెల్లడించారు. ఫస్ట్ కాపీ చూసినప్పుడే సినిమా అనుకున్నట్లుగా రాలేదని గ్రహించి, ఆ విషయాన్ని తన సన్నిహితులతో పంచుకున్నట్లు చెప్పారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారని, హీరోగా ఆ పెట్టుబడిని వీలైనంత వరకు రికవర్ చేసేందుకు సినిమాకు మద్దతుగా నిలబడటం తన కనీస బాధ్యత అని భావించే ప్రమోషన్స్ చేశానని వివరించారు. ఓటమి నిందను ఇతరులపైకి నెట్టకుండా, తన తప్పును తాను స్వయంగా ఒప్పుకున్న అఖిల్ నిజాయితీపై అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

ఈ ఓటమి పాఠాల నుంచి నేర్చుకున్న అఖిల్, మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆద్యంతం ఆకట్టుకునే కథనం, అఖిల్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరిన 'లెనిన్', అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఆయనకు అదిరిపోయే హిట్‌ను అందించంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story