పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ గుడ్ న్యూస్!
తెలంగాణలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న పర్సంటేజ్ రెవెన్యూ వివాదానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎట్టకేలకూ ఒక ముగింపు పలికింది
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న పర్సంటేజ్ రెవెన్యూ వివాదానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎట్టకేలకూ ఒక స్పష్టమైన ముగింపు పలికింది. ఈ మేరకు ఛాంబర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సద్దుమణిగిన పర్సంటేజ్ వివాదం
టాలీవుడ్‌లో థియేటర్ల అద్దె విధానం (ఫిక్స్‌డ్ రెంటల్స్) స్థానంలో కలెక్షన్ల ఆధారంగా పంచుకునే పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదలకు ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఇండస్ట్రీలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు నేతృత్వంలో ఒక ప్రత్యేక సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
టికెట్ రేట్లు పెరిగితే 7.5 శాతం వాటా
నూతన సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ‘పెద్ది’ సినిమాకు ప్రభుత్వం తరపున టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లభిస్తే, ఆ పెరిగిన అదనపు ఆదాయంపై థియేటర్ల యాజమాన్యాలకు (ఎగ్జిబిటర్లకు) 7.5 శాతం వాటాను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకపోతే.. ఎప్పటిలాగే పాత పద్ధతిలోనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పరస్పర అంగీకారంతో సెటిల్ చేసుకోవాలని ఛాంబర్ స్పష్టం చేసింది.
ప్రీమియర్ షోల రేట్లు ఖరారు
భారీ అంచనాలున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి నిర్వహించే ప్రత్యేక ప్రీమియర్ షోల రేట్లను కూడా ఛాంబర్ అధికారికంగా ఖరారు చేసింది. షోల వారీగా ఎగ్జిబిటర్లకు చేయాల్సిన చెల్లింపుల వివరాలు ఇలా ఉన్నాయి:
‘A’ సెంటర్స్: రూ. 25,000/- (ప్రతి షోకి), ‘B’ సెంటర్స్: రూ. 15,000/- (ప్రతి షోకి) , ‘C’ సెంటర్స్: రూ. 10,000/- (ప్రతి షోకి)
మూడు వారాల్లో శాశ్వత విధానం
రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో ఈ పర్సంటేజ్ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయడానికి ఇండస్ట్రీ పెద్దలంతా అంగీకరించారు. తదుపరి పెద్ద సినిమా విడుదలయ్యేలోపు లేదా ఇప్పట్నుంచి మూడు వారాల్లోగా ఒక పూర్తి స్థాయి నూతన ఆదాయ భాగస్వామ్య విధానాన్ని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలకు పాత నిబంధనలే వర్తిస్తాయని, మిగిలిన చిత్రాలకు కొత్త విధానం వర్తిస్తుందని ఛాంబర్ తెలిపింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ‘పెద్ది’ సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.




