Allu Arjun: సోషల్ మీడియా ట్రోల్స్‌కు చెక్ పెట్టండి.. అభిమానులతో ఐకాన్ స్టార్ బన్నీ భేటీ!
Allu Arjun: సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు. నచ్చని వారి గురించి సమయం వృథా చేయకుండా నచ్చిన పని చేసుకుంటూ వెళ్లాలని అభిమానులకు బన్నీ సూచన.
Allu Arjun: సోషల్ మీడియా ట్రోల్స్‌కు చెక్ పెట్టండి.. అభిమానులతో ఐకాన్ స్టార్ బన్నీ భేటీ!
Allu Arjun: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత విమర్శలపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. నచ్చని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ సమయం, డబ్బు వృథా చేయడం కంటే.. తమకు నచ్చిన పని చేసుకుంటూ సొంత ఎదుగుదలపై దృష్టి పెట్టడం మంచిదని అభిమానులకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బన్నీ తన అభిమానులను నేరుగా కలిసి మాట్లాడారు.
సోషల్ మీడియాలో ఇటీవల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మార్ఫింగ్ ఫొటోలు, మీమ్స్‌తో హేళన చేయడం ఎక్కువైందని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినీ ఎప్పుడూ ట్రోల్ చేయకూడదని తన అభిమానులకు స్పష్టం చేశారు.
"మనకు నచ్చని వారి కోసం డబ్బు ఖర్చు పెడతామా? లేదు కదా! మరి అలాంటి వారి కోసం మన అమూల్యమైన సమయం, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి?" అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పాటు తనను ద్వేషించే వారికీ చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు ట్రోల్స్‌పై స్పందిస్తూ సమయం వృథా చేసుకోవద్దని.. ఆ సమయాన్ని సొంత ఎదుగుదల కోసం, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.
"మీకు నచ్చిన పని చేయండి. నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి.. పర్లేదు, కనీసం నువ్వు ఆ సమయాన్ని అయినా ఆస్వాదిస్తావు కదా! కానీ అనవసర విమర్శలతో సమయాన్ని వృథా చేయకండి" అంటూ బన్నీ సరదాగా వ్యాఖ్యానించారు. అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ చేసిన ఈ సానుకూల సలహాలు, వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.




