Dj Sound: అర్ధరాత్రి డీజే మోతలతో ఇళ్లలో నరకం.. పోలీసులకు హీరో ఫిర్యాదు!

Dj Sound: హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యంపై నటుడు అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gagan kumar
Published on: 28 Sept 2026 10:35 AM IST
Dj Sound
X

Dj Sound: అర్ధరాత్రి డీజే మోతలతో ఇళ్లలో నరకం.. పోలీసులకు హీరో ఫిర్యాదు!

Allu Sirish: హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యం రోజురోజుకూ ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండుగలు, వేడుకల పేరిట రాత్రి పూట బాక్సులు బద్దలయ్యేలా మైకులు పెట్టి హోరెత్తించడం నగరంలో సర్వసాధారణమైపోయింది. అయితే, ఇదే సమస్యపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు శిరీష్ ఏకంగా పోలీసులకే అసలు సిసలు షాక్ ఇచ్చారు! సెలబ్రిటీ అయి ఉండి కూడా సామాన్యుడిలా రోడ్డెక్కి, సోషల్ మీడియా వేదికగా ఆయన లేవనెత్తిన ఈ సమస్య ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

షేక్‌పేట్‌లోని ప్రముఖ అపర్ణా వన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నటుడు అల్లు శిరీష్.. తన నివాస ప్రాంతంలో జరుగుతున్న ఒక తీవ్రమైన సమస్యను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. తమ ఇందుకు సమీపంలో ఉన్న వినోభానగర్‌లోని హనుమాన్ ఆలయం నుంచి గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళల్లో పెద్ద శబ్దాలతో మ్యూజిక్, పాటలు ప్లే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా ఎవరికైనా పండుగలు లేదా ప్రత్యేక పూజల సమయంలో మైకులు పెడితే ఒక రోజు సర్దుకోవచ్చు. కానీ, ఏకంగా రాత్రి 2, 3 గంటల వరకు కూడా బాక్సులు పెట్టి హోరెత్తిస్తుంటే ఎలా పడుకోవాలి? అని శిరీష్ నిలదీశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసి, హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేశారు.

ఈ సమస్యపై అల్లు శిరీష్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. బాధ్యత గల పౌరుడిగా ముందుగానే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే, గణేష్ నిమజ్జనం వరకు కాస్త సర్దుకుపోవాలని ఆ సమయంలో పోలీసులు సూచించారు. పోలీసులు చెప్పిన గౌరవంతో పండుగ ముగిసే వరకు ఆయన ఓపిక పట్టారు.

కానీ, పండుగ ముగిసిపోయినప్పటికీ అర్ధరాత్రి వేళల్లో ఆ శబ్దాలు మాత్రం ఆగకపోవడంతో ఆయన విసిగిపోయి మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ పెద్ద శబ్దాల వల్ల తమ సొసైటీలోని వృద్ధులు, చిన్న పిల్లలు, ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కంటి నిండా నిద్రలేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు రాలేదని, ఇప్పటికైనా హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.