వేద మంత్రాలు లేకుండా పెళ్లి చేసుకున్న అనిరుధ్ - కావ్య మారన్.. అసలేమిటీ ‘సెల్ఫ్‌ రెస్పెక్ట్ మ్యారేజ్‌’?

Self-Respect Marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 13 Nov 2026 11:09 AM IST
వేద మంత్రాలు లేకుండా పెళ్లి చేసుకున్న అనిరుధ్ - కావ్య మారన్.. అసలేమిటీ ‘సెల్ఫ్‌ రెస్పెక్ట్ మ్యారేజ్‌’?
X

వేద మంత్రాలు లేకుండా పెళ్లి చేసుకున్న అనిరుధ్ - కావ్య మారన్.. అసలేమిటీ ‘సెల్ఫ్‌ రెస్పెక్ట్ మ్యారేజ్‌’?

Self-Respect Marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నవంబర్ 11న గ్రీస్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ జంట సంప్రదాయ మంత్రాలు, ఆచారాలకు భిన్నంగా ‘సెల్ఫ్‌ రెస్పెక్ట్ మ్యారేజ్‌’ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

స్టాలిన్, రజనీకాంత్ సమక్షంలో వివాహం

అనిరుధ్-కావ్యల వివాహం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి టీఆర్‌బీ రాజా సోషల్ మీడియా వేదికగా వివరించారు. "ఈ జంట ‘సెల్ఫ్‌ రెస్పెక్ట్ మ్యారేజ్‌’ పద్ధతిని అనుసరించింది. వేడుకలో కావ్య, అనిరుధ్ ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు. ఎం.కె. స్టాలిన్ (తలైవర్) వధువు కావ్యకు ఒక గొలుసును అందించగా.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ వరుడు అనిరుధ్‌కు మరో గొలుసును అందించారు. అనంతరం వధూవరులు ఒకరికొకరు ఆ గొలుసులను మార్చుకుని ఒక్కటయ్యారు. రెండు హృదయాల కలయికకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశీర్వాదాలు అందించారు" అని ఆయన వెల్లడించారు.

అసలేమిటీ ‘సెల్ఫ్‌ రెస్పెక్ట్ మ్యారేజ్‌’?

తమిళనాడులో ప్రముఖ సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి ప్రారంభించిన 'స్వాభిమాన ఉద్యమం' (Self-Respect Movement) నుంచి ఈ వివాహ సంప్రదాయం పుట్టుకొచ్చింది. కుల వివక్ష, మతపరమైన మూఢాచారాలు, వివాహాల్లో పురోహితులు లేదా మతపెద్దల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఈ విధానాన్ని తీసుకొచ్చారు.

ఇందులో వేద మంత్రాలు, హోమాలు, విస్తృతమైన మతపరమైన క్రతువులు తప్పనిసరి కాదు. వధూవరులు పరస్పర అంగీకారంతో పూలమాలలు, తాళి లేదా బంగారు గొలుసులు మార్చుకోవడం ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెడతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులే దీనికి సాక్షులుగా ఉంటారు.

1967లో తమిళనాడు ప్రభుత్వం హిందూ వివాహ చట్టంలో సవరణలు చేసి, ఈ తరహా వివాహాలకు పూర్తి చట్టబద్ధమైన గుర్తింపు కల్పించింది. కాగా, గ్రీస్‌లో వివాహం చేసుకున్న అనిరుధ్‌-కావ్య దంపతుల వివాహ రిసెప్షన్‌ వేడుక నవంబర్ 21న చెన్నైలో అంగరంగ వైభవంగా జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.