Tamannaah: తమన్నా కోసం కాళ్లు పట్టుకోవడానికైనా రెడీ.. నటుడు షాకింగ్ కామెంట్స్
Tamannaah: నటి తమన్నా భాటియా శరీర ఛాయను ఉద్దేశించి అన్నూ కపూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Tamannaah: తమన్నా కోసం కాళ్లు పట్టుకోవడానికైనా రెడీ.. నటుడు షాకింగ్ కామెంట్స్
Annu Kapoor: గ్లామర్ ప్రపంచంలో ప్రశంసలు ఒక్కోసారి వివాదాలకు దారితీస్తుంటాయి. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అందాన్ని పొగిడే క్రమంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అన్నూ కపూర్ వాడిన పదజాలం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తాజాగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'స్త్రీ 2' సినిమాలో తమన్నా ‘ఆజ్ కీ రాత్’ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ఆమె డ్యాన్స్‌ను, అందాన్ని పొగిడే క్రమంలో అన్నూ కపూర్.. ఆమె శరీర రంగును ఉద్దేశించి హిందీలో పాలలాంటి శరీరం అని వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల వయసున్న సీనియర్ నటుడు, ఒక హీరోయిన్ శరీర ఛాయ గురించి అలా మాట్లాడటం పద్ధతి కాదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
తప్పుగా అర్థం చేసుకున్నారు
ఈ వివాదంపై అన్నూ కపూర్ తాజాగా తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. జనం తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇంగ్లీష్ లో మిల్కీ బాడీ అని అంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ అదే విషయాన్ని మన సొంత భాష హిందీలో చెప్పేసరికి అందరికీ తిట్టులా అనిపించింది. భాష మారినంత మాత్రాన భావం మారిపోదు కదా అని ఆయన ప్రశ్నించారు. తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. నేను ఆమె సౌందర్యాన్ని మెచ్చుకున్నాను తప్ప, నా మనసులో ఎలాంటి దురాశ లేదు. నా పిల్లలు కూడా ఆమె వయసు వారే అని అన్నూ కపూర్ చెప్పుకొచ్చారు.
ఒకవేళ నా మాటల వల్ల తమన్నా మనస్తాపానికి గురైతే, ఆమె పాదాలకు నమస్కరించి క్షమాపణ చెప్పడానికి నేను వెనుకాడను. నా మనసు స్వచ్ఛమైనది కాబట్టి, కాళ్లు పట్టుకోవడం నాకు పెద్ద విషయం కాదు అని ఆయన వివరణ ఇచ్చారు. రెండు దశాబ్దాలుగా వెండితెరపై రాణిస్తున్న తమన్నా, ప్రస్తుతం హిందీలో 'పురుషన్', 'మరియా ఐపిఎస్' వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అటు అన్నూ కపూర్ కూడా విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. గతంలో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రాంజాన్' సినిమాతో ఆయన తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మరి అన్నూ కపూర్ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తెరపడుతుందో లేదో వేచి చూడాలి.




