AR Rahman: ఆ ఒక్క సినిమా కోసం ఏకంగా 10-12 మూవీస్ వదులుకున్నా.. రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
AR Rahman: 'రామాయణ' సంగీతం కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డానని, పెద్ద ఫిల్మ్మేకర్ల 10 నుంచి 12 సినిమాలు వదులుకున్నానని, 'రావణ తాండవ్' పాటకు 12-13 వెర్షన్లు చేసి అందరికీ నచ్చినదాన్ని ఎంపిక చేశామని ఏఆర్ రెహ్మాన్ గోవా ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో తెలిపారు.
AR Rahman: ఆ ఒక్క సినిమా కోసం ఏకంగా 10-12 మూవీస్ వదులుకున్నా.. రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
AR Rahman: రామాయణ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. 'ఈ మూవీ కోసం 10-12 సినిమాలు వదులుకున్నా. కేవలం ఇందులో లీనమవ్వడం కోసం పెద్ద ప్రాజెక్టులనూ అంగీకరించలేదు. సినిమాలోని కొన్ని కంపోజిషన్స్ డజనుకుపైగా మార్పులకు గురయ్యాక ఖరారయ్యాయి. రావణ తాండవ్ పాట కోసం 12-13 వెర్షన్లు ప్రయత్నించాం. చివరికి అందరికీ నచ్చిన వెర్షన్‌ను ఎంపిక చేశాం' అని గోవాలో జరిగిన IFFI వేడుకల్లో తెలిపారు.
ఆదివారం (నవంబర్ 22) పనాజీలో 57వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (IFFI)లో భరత్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన 'బనారస్' ప్రదర్శన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రెహ్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను నిజంగా మనసు కలిసిన ప్రాజెక్టులనే ఒప్పుకుంటానని చెప్పారు. 'రామాయణ' కోసం 'చాలా, చాలా ముఖ్యమైన పెద్ద ఫిల్మ్మేకర్లను వదులుకున్నాను. దాని గురించి గర్వపడుతున్నాను' అని అన్నారు.
'రామాయణ' సంగీతాన్ని రెహ్మాన్ జర్మన్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో కలిసి కంపోజ్ చేశారు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. 2009 నుంచే ఒకరికొకరు తెలుసు. ఈ సినిమా ద్వారా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. రెహ్మాన్ కార్యనిర్వాహక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక థీమ్‌కు జిమ్మర్ మొదట సౌండ్‌స్కేప్ రూపొందించగా, రెహ్మాన్ దానికి సంస్కృత శ్లోకాన్ని జోడించారని సమాచారం.
లాస్ ఏంజెలెస్, లండన్, బుడాపెస్ట్, ముంబై, చెన్నైల్లో రికార్డింగ్, స్కోరింగ్ సెషన్లు జరిగాయి. 'రావణ తాండవ్' పాటకు వేర్వేరు భాషల్లో అనేక వెర్షన్లు చేయాల్సి వచ్చిందని, అందుకే జాగ్రత్తగా పని చేయాల్సి వచ్చిందని రెహ్మాన్ తెలిపారు. కొన్నిసార్లు 13 వెర్షన్ల తర్వాత మళ్లీ తొలి ప్రయత్నాల్లో ఒకదానికే తిరిగి రావాల్సి వచ్చిందని హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు చెప్పినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 'రావణ తాండవ్', 'మంగళ్ రంగ్' పాటలపై శ్రోతల నుంచి ప్రశంసలు, విమర్శలు రెండూ వచ్చాయి.
'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 5న విడుదలైంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు. ఈ సినిమా 57వ ఐఎఫ్ఎఫ్ఐలో 'ఫిల్మ్స్ ఫ్రమ్ బ్రిక్స్' విభాగంలో ఓపెనింగ్ ఫిల్మ్‌గా ప్రదర్శితమైంది. ఈ చిత్రోత్సవం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతోంది. కాగా, ఇప్పటికే ఈ చిత్రం రూ. 1500 కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే.




