AR Rahman: అందరినీ మెప్పించాలంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలి.. 'మంగళ్ రంగ్' విమర్శలపై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు!
AR Rahman: 'రామాయణ' సినిమా పాటలపై విమర్శలకు ఏఆర్ రెహమాన్ ఘాటు కౌంటర్. స్టీవ్ జాబ్స్ కోట్తో ట్రోలర్స్‌కు సమాధానం, హన్స్ జిమ్మర్తో కాంబినేషన్ విశేషాలు.
AR Rahman: అందరినీ మెప్పించాలంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలి.. 'మంగళ్ రంగ్' విమర్శలపై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు!
AR Rahman: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ (శ్రీరాముడిగా), సాయిపల్లవి (సీతగా) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగం నవంబరు 5న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాట సంగీతంపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాట అనుకున్న స్థాయిలో లేదని విమర్శలు రావడంతో ఈ అంశంపై ఆస్కార్ విజేత, చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అత్యంత ఘాటుగా, ఆసక్తికరంగా స్పందించారు.
ఒక పాటలోని ప్రతీ అభిప్రాయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని రెహమాన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పిన ఒక ప్రసిద్ధ వ్యాఖ్యను ఆయన గుర్తుచేసుకుంటూ, అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలని, కళాకారుడిగా అందరినీ మెప్పించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఒక పాట తుది రూపం దాల్చడానికి ఎంతో సమయం, సృజనాత్మక ఆలోచన అవసరమవుతాయని, ప్రతీదాన్ని ముందే తొందరపడి అంచనా వేయకూడదని ఆయన హితవు పలికారు.
ఊరగాయ పాతబడే కొద్దీ రుచిగా మారినట్లే, స్వరాలు కూడా వినేకొద్దీ అలవాటై శ్రోతలకు బాగా నచ్చుతాయని వివరించారు. కొన్నిసార్లు సంగీతంలో మానవ సంస్కృతి, సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ప్రేక్షకులు విమర్శించేటప్పుడు ఒక కోణాన్ని మాత్రమే చూస్తారు కాబట్టి కాస్త ఓపిక పట్టాలని సూచించారు.
ఇదే ఇంటర్వ్యూలో హాలీవుడ్ ఆస్కార్ విజేత హన్స్ జిమ్మర్తో కలిసి పనిచేయడంపై కూడా రెహమాన్ మాట్లాడారు. జిమ్మర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' చిత్రంపై విశేష ఆసక్తి పెరిగిందన్నారు. ఐదు విభిన్న భాషలతో పాటు హాలీవుడ్, ఇండియన్ వెర్షన్లకు వేర్వేరుగా సంగీతం అందించాల్సి రావడం వల్ల దాదాపు 10 సినిమాలకు సరిపడా పని చేసినట్లుగా అనిపించిందని తెలిపారు. ఏదేమైనా ఎంతో శ్రమించి అందించిన ఈ సంగీతం సినిమా విడుదలయ్యాక ప్రేక్షక దేవుళ్లను కచ్చితంగా అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




