Baahubali: ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు రాజమౌళి ‘బాహుబలి’ యానిమేషన్ మూవీ!
Baahubali: ‘బాహుబలి’ రాజమౌళి తెరకెక్కించిన ఈ టూ-పార్ట్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.
Baahubali: ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు రాజమౌళి ‘బాహుబలి’ యానిమేషన్ మూవీ!
Baahubali: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దృశ్యకావ్యం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ టూ-పార్ట్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ఈ బ్రాండ్.. ఇప్పుడు యానిమేషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతూ ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ రూపంలో మరింత విస్తరిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది.
ఫ్రాన్స్ యానిమేషన్ ఫెస్టివల్‌లో రాజమౌళి సంచలనం!
ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేయడానికి ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా హాజరవుతున్నారు. ఈ ఫెస్టివల్‌లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’విభాగం కింద ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ ప్యానెల్ డిస్కషన్‌కు సంబంధించిన టికెట్లు బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోవడం గమనార్హం. దీన్ని బట్టి అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
‘స్పైడర్-మ్యాన్’, ‘ఫ్లో’ చిత్రాల సరసన ‘బాహుబలి’!
ఈ ఘనత అంత తేలికైనదేమీ కాదు. గతంలో ఆస్కార్ గెలుచుకున్న ‘స్పైడర్-మ్యాన్: ఇంటు ది స్పైడర్-వర్స్’,2025 ఆస్కార్ విజేత ‘ఫ్లో వంటి ప్రపంచ ప్రసిద్ధ యానిమేషన్ చిత్రాలు కూడా ఇదే ఆన్సీ ఫెస్టివల్‌లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ఆ లీగ్‌లోకి ప్రవేశించిన అతికొద్ది భారతీయ యానిమేషన్ ప్రాజెక్ట్‌లలో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించింది.
రెండు భాగాలుగా యానిమేషన్ ఎపిక్.. 2027లో రిలీజ్!
ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అఫీషియల్ టీజర్ అంతర్జాతీయంగా యానిమేషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ ఈషాన్ శుక్లా ఈ టూ-పార్ట్ యానిమేషన్ ఎపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ట్రెడిషనల్ యానిమేషన్, సీజీఐ , క్లేమేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఈ విజువల్ వండర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోని మొదటి భాగం 2027లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెండితెరపైనే కాకుండా యానిమేషన్ రంగంలోనూ ‘బాహుబలి’ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




