Bigg Boss 10: బిగ్ బాస్ ఇంట్లో చివరి కెప్టెన్సీ పోరు.. ఆర్కేకు షాక్.. దేబ్జానీకి పట్టాభిషేకం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో చివరి కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. వర్షిణి, త్రిగుణ్ మధ్య క్యారెక్టర్ లెస్ మాటతో గొడవ జరగ్గా, మరోవైపు కెప్టెన్సీ పోటీలో ఆర్పీ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో చివరి కెప్టెన్సీ పోరు ఇంటి సభ్యుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. పన్నెండో వారంలో జరిగిన బడ్డీ అప్ టాస్కుల తర్వాత రామకృష్ణ (ఆర్కే), శివ్, దేబ్జానీ, సుధీర్, నరేష్, అమన్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. మరోవైపు మిగిలిన సభ్యులకు కూడా కెప్టెన్సీ పోటీలోకి వచ్చే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఐదుగురిలో నలుగురికే అవకాశం ఉండటంతో త్రిగుణ్, వర్షిణి, ముకేశ్, రామ్ ప్రసాద్, వంశీ మధ్య చర్చ మొదలైంది. ఈ సమయంలో వర్షిణి ఆడతానని చెప్పగా త్రిగుణ్ అభ్యంతరం తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య గతంలో జరిగిన గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా 'క్యారెక్టర్ లెస్' అనే మాట చుట్టూ వాదన జరిగింది. త్రిగుణ్ తనను అలా అన్నాడని వర్షిణి ప్రశ్నించగా, తనను కూడా గతంలో ఎన్నో మాటలు అన్నారని త్రిగుణ్ గుర్తుచేశాడు.
కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి
ఈ గొడవలో వర్షిణి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా మాట్లాడటం బాధ కలిగించిందని చెప్పింది. మరోవైపు త్రిగుణ్ తన వాదనను వినిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వంశీ, ఆర్పీ, శివ్ అతడిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ముకేశ్ మాత్రం వర్షిణికి మద్దతుగా నిలిచాడు. ఇంట్లో అందరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వర్షిణి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో కొంతసేపు ఇంట్లో వాతావరణం వేడెక్కింది. చివరకు ఈ చర్చ తర్వాత ముకేశ్, రామ్ ప్రసాద్, వంశీ, త్రిగుణ్ కెప్టెన్సీ అర్హత కోసం జరిగే పోటీలో పాల్గొన్నారు. పేపర్లపై సంతకాలు చేసి వాటిని బోర్డుకు అతికించే టాస్క్‌లో రామ్ ప్రసాద్ ఎక్కువ పేపర్లు అతికించి కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు.
బంతుల టాస్కులో ఒక్కొక్కరుగా ఎలిమినేషన్
ఆ తర్వాత కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. పై నుంచి పడే బంతులను సేకరించి తమకు మద్దతుగా నిలిచిన సభ్యులు పోటీదారుల బాక్సుల్లో వేయాలి. పోటీలో ఉన్నవారు తమ బాక్సుల్లోని బంతులను కాపాడుకుంటూ ఇతరుల బాక్సుల్లోని బంతులను తీసుకోవచ్చు. ప్రతి రౌండ్లో తక్కువ బంతులు ఉన్నవారు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో శివ్ ఎలిమినేట్ అయ్యాడు. అనంతరం సంచాలక్‌గా వ్యవహరించిన శివ్ కొన్ని నిబంధనలు పెట్టాడు. ఈ క్రమంలో త్రిగుణ్ అమన్ బాక్స్‌లోని బంతులను తీసేయడంతో అతడిని డిస్క్వాలిఫై చేశారు. ఆ తర్వాత అమన్ సంచాలక్‌గా మారగా సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు. సుధీర్ స్థానంలో త్రిగుణ్‌కు అవకాశం ఇవ్వడంతో ముకేశ్ అభ్యంతరం తెలిపాడు. అయినప్పటికీ బిగ్ బాస్ నిర్ణయంతో త్రిగుణ్ మళ్లీ పోటీలోకి వచ్చాడు. తదుపరి రౌండ్లో రామ్ ప్రసాద్, నరేష్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో చివరికి ఆర్కే, దేబ్జానీ మాత్రమే మిగిలారు.
ఆర్పీ నిర్ణయంతో ఆర్కేకు షాక్.. దేబ్జానీకి కెప్టెన్సీ
చివరి రౌండ్లో ఆర్కే, దేబ్జానీ మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. ఇంట్లో ఎక్కువ మంది దేబ్జానీకి మద్దతు ఇవ్వడంతో ఆర్కే ఒత్తిడికి గురయ్యాడు. ఈ సమయంలో రామ్ ప్రసాద్ సంచాలక్‌గా వ్యవహరిస్తూ ఫిజికల్‌గా ఆడకూడదని నిబంధన పెట్టాడు. దీనిపై ఆర్కే అభ్యంతరం వ్యక్తం చేశాడు. గత రౌండ్లలో వేర్వేరు నిబంధనలు పెట్టారని వాదించాడు. మరోవైపు శివ్ కూడా దేబ్జానీకి మద్దతుగా ఎక్కువ మంది ఉన్నారని వ్యాఖ్యానించాడు. చివరి దశలో ఆర్కే దేబ్జానీ బాక్స్‌లోని బంతులను తీసే ప్రయత్నం చేశాడు. అయితే రామ్ ప్రసాద్ ముందే చెప్పిన నిబంధన ప్రకారం ఫిజికల్‌గా వ్యవహరించినందుకు బంతులను లెక్కించకుండానే దేబ్జానీని విజేతగా ప్రకటించాడు. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో చివరి కెప్టెన్‌గా దేబ్జానీ నిలిచింది. రామ్ ప్రసాద్ ఆమెను ఎత్తుకొని తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇతర సభ్యులు కూడా ఆమెకు అభినందనలు తెలిపారు.
ఆర్పీకి కుటుంబం నుంచి ప్రత్యేక ఆడియో గిఫ్ట్
కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం ఇంట్లో అత్యధిక గోల్డ్ కాయిన్స్ సంపాదించిన రామ్ ప్రసాద్‌కు బిగ్ బాస్ మూడు ఆఫర్లు ఇచ్చాడు. వాటిలో ఒకటిగా తన కుటుంబ సభ్యుల నుంచి ఆడియో మెసేజ్ కోరుకున్నాడు. దీంతో బిగ్ బాస్ అతడి అక్క మాట్లాడిన ఆడియోను పంపించాడు. కుటుంబ సభ్యుల గొంతు విన్న రామ్ ప్రసాద్ ఎంతో సంతోషించాడు. ఇలా చివరి కెప్టెన్సీ టాస్కులో వర్షిణి, త్రిగుణ్ గొడవ, ఆర్కే అసంతృప్తి, ఆర్పీ నిర్ణయం, దేబ్జానీ విజయం వంటి పరిణామాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. సీజన్ చివరి కెప్టెన్‌గా దేబ్జానీ నిలవడంతో ఇంట్లో కొత్త సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.




