Bigg Boss 10: అమన్‌కు షాకిచ్చిన త్రిగుణ్.. నరేష్‌కు కెప్టెన్సీ పట్టం.. వర్షిణికి బిగ్ పనిష్మెంట్
బిగ్ బాస్ తెలుగు 10లో నవంబర్ 14 ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అమన్‌కు మద్దతు ఇస్తాడనుకున్న త్రిగుణ్ చివరి ఓటుతో నరేష్‌ను కెప్టెన్ చేశాడు. మరోవైపు బిగ్ జీరోగా వర్షిణి ఎంపికైంది.
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శనివారం, నవంబర్ 14న ప్రసారమైన 69వ రోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ ఎంపికతో పాటు ఇంటి సభ్యుల మధ్య జరిగిన పాత గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. అమన్‌కు మద్దతు ఇస్తాడని భావించిన త్రిగుణ్ చివరి నిమిషంలో నరేష్‌కు ఓటు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు వర్షిణిని ఇంటి సభ్యులు బిగ్ జీరోగా ఎంపిక చేయడంతో ఆమెకు నాగార్జున ప్రత్యేక పనిష్మెంట్ ఇచ్చాడు. చివర్లో తల్లి ఇంట్లోకి రావడంతో వర్షిణి భావోద్వేగానికి గురైంది.
అమన్‌ను కాదని నరేష్‌కు కెప్టెన్సీ
పదో వారం కెప్టెన్ ఎంపిక కోసం అమన్, వంశీ, ఆర్కే, నరేష్ రెండో స్థాయికి చేరుకున్నారు. అక్కడ ఇంటి సభ్యుల ఓట్లతో నరేష్‌కు అవకాశం దక్కింది. చివరి నిర్ణయాత్మక ఓటు త్రిగుణ్ది కావడంతో అందరి దృష్టి అతడిపైనే నిలిచింది. త్రిగుణ్ అమన్‌కు మద్దతు ఇస్తాడని చాలామంది అనుకున్నా.. అతడు నరేష్‌కు ఓటు వేశాడు. ఇప్పటివరకు నరేష్ కెప్టెన్ కాలేదని, అతడి కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నానని త్రిగుణ్ చెప్పాడు. నరేష్ తప్పు చేస్తే తప్పకుండా ప్రశ్నిస్తానని, అమన్‌కు సారీ చెబుతున్నానని అన్నాడు. దీంతో నరేష్ పదో వారం కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మరోవైపు శివ్ మాత్రం ఆర్కేకు కాకుండా అమన్‌కు ఓటు వేశాడు. త్రిగుణ్ ముందే నరేష్‌ను కెప్టెన్ చేయాలని ప్లాన్ చేశాడని, ఆ ప్లాన్‌కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో అమన్‌కు ఓటు వేశానని శివ్ వివరించాడు.
ఐ యామ్ సారీ టాస్క్.. పాత గొడవలపై క్లారిటీ
కెప్టెన్సీ టాస్క్ తర్వాత నాగార్జున ఇంటి సభ్యులకు 'ఐ యామ్ సారీ.. ఐ యామ్ నాట్ సారీ' అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఇంట్లో ఎవరి వల్ల ఎక్కువగా బాధపడ్డారు? ఏ సంఘటన తమను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది? అన్నది చెప్పాలని సూచించాడు. ముందుగా వర్షిణి మాట్లాడుతూ.. త్రిగుణ్ తనను క్యారెక్టర్ లెస్ అని అన్న మాటలు బాధించాయని చెప్పింది. దీనికి త్రిగుణ్ స్పందిస్తూ, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంగీకరించి వర్షిణికి క్షమాపణలు చెప్పాడు. శ్వేత మాత్రం రాం ప్రసాద్ తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది. గతంలో జరిగిన టాస్క్‌లో సంచాలకుడిగా అతడు తప్పు నిర్ణయం తీసుకున్నాడని చెప్పింది. అయితే రాం ప్రసాద్ మొదట సారీ చెప్పడానికి నిరాకరించాడు. నాగార్జున వీడియో చూపించి ఆ సంఘటనపై స్పష్టత ఇచ్చాడు. శ్వేత కాలు బయట పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోందని, ఆ నిర్ణయం సరైనదేనని వివరించాడు.
క్షమాపణలు చెప్పిన కంటెస్టెంట్లు
ఈ టాస్క్‌లో పలువురు కంటెస్టెంట్లు తమ మధ్య ఉన్న మనస్పర్థలపై మాట్లాడుకున్నారు. నీతూ చెప్పిన విషయంపై వంశీ, శివ్ ప్రస్తావించిన అంశంపై ముకేష్, నరేష్ చెప్పిన మాటలపై త్రిగుణ్ క్షమాపణలు చెప్పారు. అమన్‌కు కూడా త్రిగుణ్ సారీ చెప్పాడు. అయితే సుధీర్ చెప్పిన విషయాన్ని ముకేష్ అంగీకరించలేదు. తనకు దెబ్బ తగిలినప్పుడు కూడా అది నాటకమని ముకేష్ అన్నాడని సుధీర్ గుర్తుచేశాడు. తాను అప్పుడు అలానే భావించానని ముకేష్ చెప్పడంతో క్షమాపణలు చెప్పలేదు. మరోవైపు రాం ప్రసాద్ తనను కన్నింగ్ అని అన్న విషయాన్ని వర్షిణి ప్రస్తావించింది. రాం ప్రసాద్ బాధపడుతున్నాడని భావించి సారీ చెబుతున్నానని వర్షిణి చెప్పింది. దేబ్జానీకి రాం ప్రసాద్, త్రిగుణ్‌కు వర్షిణి, ఆర్కేకు నరేష్ క్షమాపణలు చెప్పారు.
ఇక కెప్టెన్ అయ్యే అవకాశం లేదు
ఆ తర్వాత నాగార్జున బిగ్ జీరో టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఆట పరంగా ఎవరు వెనుకబడ్డారని భావిస్తున్నారో వారి మెడలో జీరో గుర్తు వేయాలని చెప్పాడు. ఈ టాస్క్‌లో వర్షిణికి ముగ్గురు, సుధీర్‌కు ముగ్గురు జీరో గుర్తులు వచ్చాయి. త్రిగుణ్ ఆట తీరుపైనా శివ్ విమర్శలు చేశాడు. అతడి ఆట జీరో అని, మాటలు మాత్రం ఎక్కువగా చెబుతున్నాడని వ్యాఖ్యానించాడు. చివరకు వర్షిణి, సుధీర్ మధ్య టై రావడంతో నాగార్జున మరోసారి ఇంటి సభ్యుల అభిప్రాయాలను తీసుకున్నాడు. అందులో వర్షిణి బిగ్ జీరోగా నిలిచింది. దీంతో ఆమెకు నాగార్జున పనిష్మెంట్ ప్రకటించాడు. వర్షిణి ఎంపిక చేసుకున్న బ్లూ పిల్లో ఇకపై కెప్టెన్ అయ్యే అవకాశం లేదని రాసి ఉంది. అంటే ఈ సీజన్లో వర్షిణి మళ్లీ కెప్టెన్సీ పోటీకి అర్హురాలు కాదని నాగార్జున స్పష్టం చేశాడు.
వర్షిణి కోసం ఇంట్లోకి తల్లి
ఎపిసోడ్ చివర్లో నాగార్జున మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు. వర్షిణి తల్లి లేదా ఆర్కే తల్లి.. వీరిలో ఒకరికి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించాడు. దీనిపై ఇంటి సభ్యుల ఓటింగ్ నిర్వహించగా ఏడుగురు వర్షిణి తల్లికి మద్దతు తెలిపారు. దీంతో ఆమె తల్లి ఇంట్లోకి వచ్చారు. చాలా రోజుల తర్వాత తల్లిని చూసిన వర్షిణి ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన ఆట బాగుందని తల్లి చెప్పడంతో మరింత సంతోషించింది. ఇలా కెప్టెన్సీ మార్పులు, పాత గొడవలు, బిగ్ జీరో పనిష్మెంట్తో మొదలైన ఎపిసోడ్.. వర్షిణి తల్లి రాకతో భావోద్వేగంగా ముగిసింది.




