Bigg Boss 10: పోరా మతిమరుపు.. ముకేష్‌పై వంశీ ఫైర్.. అమన్ మాటలతో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్
బిగ్ బాస్ తెలుగు 10 తొమ్మిదో వారం నామినేషన్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముకేష్‌ను వంశీ నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Mukesh
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10లో ఎనిమిదో వారం రోహిత్ ఎలిమినేషన్ తర్వాత ఇంటి సభ్యుల మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు తొమ్మిదో వారం నామినేషన్లలోనూ అదే అంశం చర్చకు వస్తోంది. త్రిగుణ్‌కు బిగ్ బాస్ చూపించిన వీడియోలో కొందరు సభ్యులు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఇంట్లో గొడవలకు కారణమవుతున్నాయి. ఆ వీడియోలో రోహిత్, ముకేష్, వర్షిణి, సుధీర్, ఝాన్సీ తదితరులు చేసిన వ్యాఖ్యలపై మిగతా సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ పరిణామాలతో ముకేష్ అండ్ గ్యాంగ్ పై ఇంట్లో వ్యతిరేకత పెరిగినట్లు కనిపిస్తోంది.
ముకేష్‌ను నామినేట్ చేసిన వంశీ
తొమ్మిదో వారం నామినేషన్లలో ముకేష్, వంశీ మధ్య వాగ్వాదం హైలైట్‌గా నిలిచింది. ముకేష్ వంశీని నామినేట్ చేయగా, ఇద్దరి మధ్య మాటలు వేడెక్కాయి. మరోవైపు ఆర్కేను ఉద్దేశించి నీతూ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రోమోలో కనిపించాయి. తనకు సరైన కారణాలు చెప్పకుండా రెండుసార్లు ఎగ్జిట్ ఇచ్చారని ఆర్కే ప్రశ్నించగా, చిన్న విషయానికే అంత గట్టిగా మాట్లాడొద్దని నీతూ బదులిచ్చింది. ఈ క్రమంలో వంశీ ముకేష్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
అమన్‌ను నామినేట్ చేసిన నరేష్, సుధీర్
మరో ప్రోమోలో నరేష్, అమన్‌ను నామినేట్ చేశాడు. హోటల్ టాస్కులో స్టార్ ఇస్తానని చెప్పిన విషయాన్ని కారణంగా చూపించాడు. తనకు ఎవరికి స్టార్ ఇవ్వాలో స్పష్టత ఉందని, నరేష్‌కు చెప్పాల్సిన అవసరం లేదని అమన్ సమాధానమిచ్చాడు. దానికి నరేష్.. శ్వేతకు ఇస్తానని, తనకు ఇస్తానని చెప్పడం స్పష్టత కాదని, అయోమయమని కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు సుధీర్ కూడా అమన్‌ను నామినేట్ చేశాడు. రోహిత్ తన స్నేహితుడని చెబుతూనే అతడిని బయటకు పంపేందుకు ఓటు వేయడం తనకు నచ్చలేదని చెప్పాడు. దీనికి అమన్ స్పందిస్తూ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని అన్నాడు.
రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అమన్ క్లారిటీ
సుధీర్, అమన్ మధ్య జరిగిన వాగ్వాదంలో రోహిత్ ప్రస్తావన మరోసారి వచ్చింది. చిన్న సంఘటన ఆధారంగా తనను నమ్మదగని వ్యక్తిగా రోహిత్ భావించాడని, అక్కడే తమ మధ్య స్నేహం ముగిసిందని అమన్ చెప్పాడు. అందుకే తానే రోహిత్‌ను బయటకు పంపేందుకు ఓటు వేశానని స్పష్టం చేశాడు. ముకేష్ మాత్రం అమన్ రోహిత్ గురించి పాజిటివ్ విషయాలు ఎక్కువగా, నెగెటివ్ విషయాలు తక్కువగా చెప్పాడని ప్రశ్నించాడు. త్రిగుణ్ చూపించిన వీడియో తనను తీవ్రంగా కలచివేసిందని శ్వేత కూడా చెప్పింది.
ముకేష్ దూకుడుపై శ్వేత విమర్శలు
టాస్కుల్లో ముకేష్ అతిగా దూకుడుగా వ్యవహరిస్తున్నాడని శ్వేత నామినేషన్ సమయంలో ఆరోపించింది. బంతిని పట్టుకునే క్రమంలో కొట్టడానికి వచ్చినట్లు ముందుకు వస్తున్నాడని ఆమె చెప్పింది. తాను తీసుకొచ్చిన బంతిని పట్టుకుని వేరే వాళ్లు పరుగెత్తారని ముకేష్ వివరణ ఇచ్చాడు. శివ కూడా టాస్కులో తాను చేసిన పనులను ముకేష్ చెప్పడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు వర్షిణిని నరేష్ నామినేట్ చేయగా, గతంలో తన కోసం రాంప్రసాద్ టాస్క్ వదిలేసిన విషయాన్ని ఆమె గుర్తుచేసింది. దానికి నరేష్ వచ్చే వారం నామినేట్ చేస్తానని చెప్పడంతో వాగ్వాదం మరింత పెరిగింది




