Bigg Boss 10: రోహిత్‌పై త్రిగుణ్ ఫైర్.. ఉరేసుకుని చచ్చిపో అంటూ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 43వ రోజు ఎమోషన్స్, గొడవలు, నామినేషన్లతో హౌస్ వేడెక్కిపోయింది.
Bigg Boss 10 Telugu
Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 43వ రోజు ఎమోషన్స్, గొడవలు, నామినేషన్లతో హౌస్ వేడెక్కిపోయింది. షాలిని ఎలిమినేట్ అయిందని భావించిన రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని ఆర్కే, అమన్ ఓదార్చే ప్రయత్నం చేశారు. షాలిని వెళ్లిపోయిందనే బాధ నుంచి బయటపడి మళ్లీ ఆటపై దృష్టి పెట్టాలని అమన్ సూచించాడు. అయితే షాలిని నిజంగా హౌస్ నుంచి బయటకు వెళ్లలేదు. ఆమెను సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. అక్కడి నుంచి రోహిత్‌తో పాటు మిగతా కంటెస్టెంట్ల కదలికలను గమనించే అవకాశం ఆమెకు లభించింది. రోహిత్ తన బాటిల్‌తో తాగడం, ఆమె ఇయర్రింగ్స్ను చేతిలో పట్టుకుని బాధపడటం చూసి షాలిని స్పందించింది. మరోవైపు వర్షిణి, ముకేష్ అర్ధరాత్రి నామినేషన్ల గురించి మాట్లాడుతున్నారని గమనించిన షాలిని.. బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేసింది. నామినేషన్ల అంశంపై గతంలో హెచ్చరికలు వచ్చినా కంటెస్టెంట్లు మళ్లీ అదే చర్చ చేస్తున్నారని పేర్కొంది.
ఝాన్సీ వర్సెస్ రామకృష్ణ.. కాళ్లు మొక్కడం తప్పా?
ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో హౌస్‌లో వాదనలు మొదలయ్యాయి. తొలుత ఝాన్సీకి ఒకరిని నామినేట్ చేసే అవకాశం వచ్చింది. ఆమె రామకృష్ణను ఎంచుకుంది. షాలిని కాళ్లపై పడిన తీరు తనకు నచ్చలేదని కారణం చెప్పింది. దీనిపై రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశాడు. షాలినిని అనుకోకుండా తోసేయడంతో ఆమె బాధపడిందని, అందుకే క్షమాపణ చెప్పానని వివరించాడు. కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ఈ చర్చలోకి త్రిగుణ్ కూడా వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పడంతో వాదన మరింత పెరిగింది. రోహిత్ కూడా జోక్యం చేసుకుని రామకృష్ణ ప్రవర్తనను సమర్థించే ప్రయత్నం చేశాడు. ఝాన్సీ భావోద్వేగాలను రామకృష్ణ అనుకరించడంపై ఆమె అభ్యంతరం చెప్పగా, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని రామకృష్ణ బదులిచ్చాడు. చిన్న విషయంగా మొదలైన ఈ చర్చ కాస్తా హౌస్‌లో మరో గొడవకు దారితీసింది.
వర్షిణి, నీతూ మధ్య మాటల మంటలు
ఆ తర్వాత నీతూకు నామినేషన్ అధికారం దక్కింది. ఆమె వర్షిణిని నామినేట్ చేస్తూ.. హౌస్‌లో సొంతంగా ఆట ఆడటం లేదని, ఇతరులతో కలిసి గ్రూప్‌గా ఉంటోందని ఆరోపించింది. దీనికి వర్షిణి గట్టిగానే బదులిచ్చింది. కలిసి ఆడటంలో తప్పేముందని ప్రశ్నిస్తూ, తన ఆట గురించి మాట్లాడే అర్హత నీతూకు లేదని వ్యాఖ్యానించింది. నీతూ కూడా వెనక్కి తగ్గకుండా వర్షిణి ముకేష్‌ను అడ్డుపెట్టుకుని హౌస్‌లో కొనసాగుతోందని విమర్శించింది. దానికి వర్షిణి.. నీతూ కూడా బయట నుంచి చూసిన విషయాలను ఆధారంగా చేసుకుని ఆట ఆడుతోందని కౌంటర్ ఇచ్చింది. ఇద్దరి మధ్య మాటలు తీవ్రం కావడంతో ఒకరిపై ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకున్నారు. చివరకు ఈ వాగ్వాదం హౌస్‌లో మరో హాట్ టాపిక్‌గా మారింది.
రోహిత్‌ను నామినేట్ చేసిన శివ్
నామినేషన్లలో రోహిత్ సుధీర్‌ను టార్గెట్ చేశాడు. ఇతరులతో డీల్ పెట్టుకుని సొంత టీమ్‌కు నష్టం కలిగించాడని ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలపై సుధీర్ స్పందిస్తూ, రోహిత్ కూడా తనతో డీల్ గురించి మాట్లాడాడని గుర్తుచేశాడు. ఈ క్రమంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత శివ్ రోహిత్‌ను నామినేట్ చేశాడు. నామినేషన్ల సమయంలో ఎదుటివారిని అవమానించేలా మాట్లాడుతున్నాడని, ఇతరులను విమర్శించే ముందు తన ప్రవర్తనను కూడా పరిశీలించుకోవాలని సూచించాడు. ఇప్పటివరకు రోహిత్ వ్యక్తిగతంగా గేమ్ గెలిచిన సందర్భాలు తక్కువని, ఎక్కువగా గ్రూప్‌పైనే ఆధారపడుతున్నాడని విమర్శించాడు. దీనికి రోహిత్ ఘాటుగా స్పందించడంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. శివ్ తన ఆటతీరును సమర్థించుకుంటూ, తాను మొదటి వారంలోనే కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచానని గుర్తుచేశాడు.
రోహిత్, త్రిగుణ్ మధ్య గొడవ పీక్స్
శివ్, రోహిత్ మధ్య జరుగుతున్న వాదనలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. షాలినికి సహాయం చేయడానికి డీల్ చేసుకున్నాడంటూ త్రిగుణ్ ఆరోపించగా, రోహిత్ వ్యక్తిగత సంబంధాల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. చెల్లి అంటూ పిలిచే వ్యక్తితో ఎలా మాట్లాడాలనే విషయంపై ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళను తాకిన తీరుకు సంబంధించిన ఆరోపణను త్రిగుణ్ ప్రస్తావిస్తూ రోహిత్‌ను ప్రశ్నించాడు. రోహిత్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కుటుంబ సభ్యులను ప్రస్తావించాడు. దీంతో ఇద్దరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకుంటూ హద్దులు దాటారు. ఒక దశలో త్రిగుణ్ రోహిత్‌పై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో గొడవ తీవ్రత పెరిగింది. శివ్ మధ్యలో జోక్యం చేసుకుని రోహిత్ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాడని చెప్పాడు. దీనికి రోహిత్ మళ్లీ ఆగ్రహంతో స్పందించాడు. మొత్తంగా 43వ రోజు ఎపిసోడ్లో షాలిని సీక్రెట్ రూమ్ ట్విస్ట్‌తో పాటు ఝాన్సీ-రామకృష్ణ, వర్షిణి-నీతూ, రోహిత్-శివ్, రోహిత్-త్రిగుణ్ మధ్య జరిగిన గొడవలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.




