Bigg Boss 10: ప్రైవసీ అడిగితే పెద్ద యుద్ధమే అయింది.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇదో కొత్త లొల్లి!

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 తాజా ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రోహిత్ మాటలతో అపూర్వ, షాలిని మధ్య గొడవ మొదలైంది.

CR Reddy
Published on: 9 Oct 2026 7:14 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10లో ఆట రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల నుంచి బయటపడేందుకు కంటెస్టెంట్లు జంటలుగా ఏర్పడి టాస్కుల్లో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 8న ప్రసారమైన ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు అమన్, త్రిగుణ్ నామినేషన్ల నుంచి తప్పించుకోగా.. మరోవైపు రోహిత్ మాటలతో అపూర్వ, షాలిని మధ్య గొడవ మొదలైంది. ఇక టాస్కుల్లో రాంప్రసాద్ తన ఆటతో సత్తా చాటాడు. దీంతో హౌస్‌లో మళ్లీ గొడవలు, పాయింట్ల లెక్కలు ఆసక్తికరంగా మారాయి.

గేమ్‌లో అమన్ దూకుడు

బిగ్‌బాస్ హౌస్‌లో ఐదు జంటలకు స్టెప్ రోల్ గోల్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కంటెస్టెంట్లు నిర్ణీత క్రమంలో ఆటను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరు ముందుగా గేమ్ పూర్తి చేస్తే వారికి ఎక్కువ పాయింట్లు దక్కుతాయి. ఈ పోటీలో కంటెస్టెంట్లు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఆటలో భాగంగా అపూర్వ రూల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో వంశీతో వాగ్వాదానికి దిగింది. చివరికి అమన్ జోడీ 100 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాంప్రసాద్ జోడీకి 80, ముకేశ్ జోడీకి 60, షాలిని జోడీకి 40, అపూర్వ జోడీకి 20 పాయింట్లు వచ్చాయి. దీంతో ఈ టాస్క్‌లో అపూర్వకు నిరాశే ఎదురైంది.

రోహిత్ మాటలతో మొదలైన గొడవ

హౌస్‌లో రోహిత్, షాలిని, రాంప్రసాద్, అమన్ కలిసి మాట్లాడుకుంటుండగా అక్కడికి అపూర్వ వచ్చింది. దీంతో తాము మాట్లాడుకోవాలని, కాసేపు ప్రైవసీ ఇవ్వాలని రోహిత్ ఆమెకు చెప్పాడు. అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత ఈ విషయం గురించి రోహిత్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. తాను నిన్ను ఉద్దేశించి అలా అనలేదని వివరించేందుకు చూశాడు. అయితే ఈ చర్చలో షాలిని జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. తన గురించి అనవసరంగా మాట్లాడొద్దని అపూర్వ చెప్పడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరోవైపు త్రిగుణ్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడు. అమన్ షాలినికి మద్దతుగా మాట్లాడుతున్నాడని భావించిన రోహిత్, అలా చేయొద్దని అతడికి సూచించాడు. ఇలా ఒక చిన్న మాటతో మొదలైన విషయం హౌస్‌లో పెద్ద గొడవకు దారితీసింది.

అమన్, త్రిగుణ్‌కు ఊరట

టాస్కుల మధ్యలో హౌస్‌మేట్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర సరదాగా గడిపారు. వర్షిణి, ముకేశ్ కలిసి నరేశ్‌ను పూల్‌లోకి తోసేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. తర్వాత మిగతా కంటెస్టెంట్లు కూడా నీటిలోకి దిగి సందడి చేశారు. ఇదిలా ఉండగా లీడర్‌బోర్డులో అమన్, త్రిగుణ్ జోడీ 180 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఈ ఇద్దరికీ నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యే అవకాశం దక్కింది. ఈ ఊరటతో అమన్, త్రిగుణ్‌కు పెద్ద టెన్షన్ తగ్గినట్లయింది. మిగతా కంటెస్టెంట్లు మాత్రం తదుపరి ఆటల్లో పాయింట్లు సాధించి తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది.

రాంప్రసాద్ జోడీకి భారీ స్కోర్

తర్వాత బిగ్‌బాస్ చిత్రం భళారే విచిత్రం అనే మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో స్క్రీన్‌పై కనిపించే బొమ్మలను గుర్తుపెట్టుకుని బోర్డుపై గీయాలి. ఆ తర్వాత సంచాలకులు చెప్పిన నంబర్లకు సంబంధించిన వస్తువులను డార్క్ యార్డ్ గదిలో నుంచి తీసుకొచ్చి సర్కిల్‌లో పెట్టాలి. సరైన సమాధానాలకు పాయింట్లు ఇస్తారు. ఈ ఆటలో బొమ్మలు గీయడం, వస్తువులు గుర్తించడం కంటెస్టెంట్లకు సవాలుగా మారింది. ఝాన్సీ ముకేశ్‌కు ముందుగానే బొమ్మల పేర్లు చెప్పిందని షాలిని ఆరోపించడంతో మరోసారి వాగ్వాదం మొదలైంది.

సంచాలకుల నిర్ణయాలపైనా రోహిత్, షాలిని అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి రాంప్రసాద్ ఐదు బొమ్మలను సరిగ్గా గుర్తించి తన జోడీకి మంచి స్కోర్ అందించాడు. రోహిత్, చరణ్ చెరో రెండు సరైన సమాధానాలు చెప్పగా.. ముకేశ్ ఒకటి మాత్రమే గుర్తించాడు. ఈ టాస్క్ ముగిసే సమయానికి రాంప్రసాద్, నరేశ్ జోడీ 220 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అపూర్వ, చరణ్ జోడీకి 200, ముకేశ్, ఝాన్సీ జోడీకి 160, రోహిత్, షాలిని జోడీకి 140 పాయింట్లు వచ్చాయి. మొత్తానికి ఆటలతో పాటు గొడవలు కూడా కొనసాగడంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.