Bigg Boss 10: గిన్నెల గోల, పర్సనల్ ఎటాక్‌లు.. బిగ్‌బాస్ ఇంట్లో రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ రచ్చ

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 నాలుగో రోజు ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో సాగింది.

CR Reddy
Published on: 11 Sept 2026 7:10 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 నాలుగో రోజు ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో సాగింది. ఒకవైపు కంటెస్టెంట్ త్రిగుణ్ లిమిట్స్ దాటి చేసిన పర్సనల్ కామెంట్లు హౌస్‌లో తీవ్ర దుమారం రేపగా, మరోవైపు ఎవరూ ఊహించని రీతిలో చరణ్ ఎలిమినేట్ అయి కన్నీటితో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్‌బాస్ హూ ఈజ్ ది బ్లాక్ షిప్ అనే ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేష్‌లు కృష్ణుడిని హై రిస్క్‌లో పెట్టగా, రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీలు చైత్రను హై రిస్క్ లో పడేశారు. ఈ గేమ్‌లో రోహిత్ టీమ్ విజయం సాధించి పర్మినెంట్ హౌస్‌మేట్స్ అయ్యారు. ఆట గెలిచామని షాలిని పాటలు వేసి సెలబ్రేట్ చేసుకోవాలనుకోవడం చైత్ర, రాంప్రసాద్‌లకు నచ్చలేదు. చైత్ర హై రిస్క్‌లో ఉంటే నువ్వు సంబరాలు చేసుకుంటావా అని షాలినితో చైత్ర గొడవకు దిగింది. నన్ను అర్థం చేసుకోకుండా సింపథీ గేమ్ అంటున్నారని షాలిని ఏడవడంతో వాతావరణం కాసేపు వేడెక్కింది.

గిన్నెల గోల.. రోహిత్‌పై త్రిగుణ్ పర్సనల్ ఎటాక్

కిచెన్ డ్యూటీ విషయంలో రోహిత్‌ను టార్గెట్ చేస్తూ త్రిగుణ్ చేసిన రచ్చ హౌస్‌లో కొత్త వివాదానికి తెరతీసింది. గిన్నెలు సరిగా తోమలేదని, అరగంటకోసారి వచ్చి చూసుకోవాలని విచిత్రమైన రూల్స్ పెట్టాడు. కుక్కర్ స్క్రూ ఊడిపోతే దాన్ని బిగిస్తూ 'బట్టీ పట్టి 90 శాతం తెచ్చుకోవడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి' అంటూ రోహిత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడతో ఆగకుండా రోహిత్ శరీరంపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. 'స్టెరాయిడ్స్ ఎక్కించుకుని బాడీని బిల్డ్ చేసిన డొల్ల బాడీ' అంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు. రోహిత్ ఎంతో సంయమనంతో వ్యవహరించినప్పటికీ, త్రిగుణ్ మాత్రం పిల్ల బచ్చా అంటూ అనుచిత వ్యాఖ్యలు కొనసాగించాడు.

హై రిస్క్ జోన్.. సంచలన నిర్ణయం

హై రిస్క్‌లో ఉన్న రాంప్రసాద్, చరణ్, చైత్రలలో ఒకరు ఇల్లు వదిలి వెళ్లాలని బిగ్‌బాస్ ఆదేశించారు. ముందుగా చైత్ర తాను వీక్ అని వెళ్లిపోతానని చెప్పగా, చరణ్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. రాంప్రసాద్ కూడా చైత్ర ఉండాలని కోరుకోవడంతో ఆమె సేఫ్ అయి హౌస్‌లోకి వెళ్లింది. చివరికి చరణ్, రాంప్రసాద్‌లలో ఎవరు ఉండకూడదో వారి ముఖానికి రంగు పూయాలని మిగిలిన సభ్యులకు బిగ్‌బాస్ సూచించారు. సెలబ్రిటీలందరూ గ్రూప్‌గా మారి చరణ్‌ ముఖానికి రంగు పూయడంతో అతడు ఎలిమినేట్ కాక తప్పలేదు.

కన్నీటి వీడ్కోలు చెప్పిన చరణ్

ఎలిమినేషన్ ఖరారైన తర్వాత చరణ్ మాట్లాడిన మాటలు అందరినీ కంటితడి పెట్టించాయి. 'నేను బలిపశువును కాలేదు, కానీ హౌస్‌లో గ్రూప్‌లు లేకుండా అందరూ ఇండివిజువల్‌గా ఆడాలని కోరుకుంటున్నా' అని అన్నాడు. రోహిత్ తన కోసం ఏడవడం చూసి తాను తట్టుకోలేకపోయానని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ చరణ్ హౌస్ నుంచి నిష్క్రమించాడు. కంటెస్టెంట్ల మధ్య గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోందని ఈ ఎపిసోడ్ నిరూపించింది.

నాలుగో రోజే పర్సనల్ ఎటాక్‌లు, గ్రూప్ రాజకీయాలు తోడవడంతో బిగ్‌బాస్ సీజన్ 10 రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. శనివారం నాగార్జున వచ్చి త్రిగుణ్ వ్యాఖ్యలపై ఎలాంటి క్లాస్ పీకుతారో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story