బిగ్ బాస్ చరిత్రలోనే సంచలనం.. లవ్ ట్రాక్‌పై తల్లిదండ్రుల రచ్చ.. కూతురిని తీసుకెళ్తామని పట్టు..!

Bigg Boss: మలయాళ బిగ్ బాస్ 8లో సంచలన సంఘటన చోటుచేసుకుంది.

Gagan kumar
Published on: 2 Nov 2026 3:45 PM IST
Bigg Boss
X

బిగ్ బాస్ చరిత్రలోనే సంచలనం.. లవ్ ట్రాక్‌పై తల్లిదండ్రుల రచ్చ.. కూతురిని తీసుకెళ్తామని పట్టు..!

Bigg Boss Malayalam Season 8: భారతీయ బుల్లితెర హిస్టరీలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అనూహ్య, సంచలన సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఫ్యామిలీ వీక్‌లో కంటెస్టెంట్లను పలకరించి, ధైర్యం చెప్పడానికి వచ్చే తల్లిదండ్రులు.. ఇక్కడ మాత్రం తమ కూతురిని వెంటనే హౌస్ నుంచి బయటకు పంపించేయాలంటూ షో వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు. మలయాళ బిగ్ బాస్ సీజన్ 8 లో చోటుచేసుకున్న ఈ హైడ్రామాకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ చేస్తున్న మలయాళ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ నేహా ఫాతిమా, తోటి కంటెస్టెంట్ సంతోష్ రాజ్‌తో క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. సంతోష్ మరొక అమ్మాయితో మాట్లాడినా, క్లోజ్ కావాడానికి ప్రయత్నించినా నేహా తీవ్ర అసూయ, ఆగ్రహం వ్యక్తం చేసేది.

అంతటితో ఆగకుండా, మనం హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా ఈ బంధాన్ని ఇలాగే కొనసాగిద్దాం అని డైరెక్ట్‌గా ప్రపోజ్ చేసింది. ఈ ఎపిసోడ్ ప్రసారమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగింది.

ఈ పరిణామాలపై నేహా ఫాతిమా కుటుంబ సభ్యులు తీవ్రంగా నొచ్చుకున్నారు. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ మోహన్ లాల్ ఉన్న వేదికపైకి నేరుగా వచ్చిన నేహా తల్లిదండ్రులు ఆవేదనతో తీవ్రస్థాయిలో స్పందించారు. అందరూ గేమ్ గెలవడానికి ఆడుతుంటే.. మా కూతురు గేమ్ పక్కన పెట్టి ఎమోషనల్ ట్రాక్‌లో పడిపోయింది.

బయట మిగతావారు ఆమెను వాడుకుంటున్నారు" అని వాపోయారు. మేము ఏ ఆట వద్దని చెప్పామో, అదే ఆటను కూతురు హౌస్‌లో ఆడుతోంది. దీనివల్ల బయట మేము వందరెట్లు నరకం అనుభవిస్తున్నాం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కూతురిని తక్షణమే షో నుంచి బయటకు పంపించేయాలంటూ మోహన్ లాల్ ముందు పట్టుబట్టారు.

తల్లిదండ్రుల కన్నీళ్లు, ఆవేదన చూసి హోస్ట్ మోహన్ లాల్ సైతం కాసేపు నిశ్చేష్టులయ్యారు. నేను కూడా ఒక కూతురికి తండ్రినే.. వాళ్ల ఆవేదన అర్థమవుతోంది. కూతురిని తీసుకువెళ్లిపోతామని పట్టుబట్టి ఇక్కడికి వచ్చారు" అని హోస్ట్ తెలపడం, హౌస్‌లోని స్క్రీన్‌పై ఇదంతా చూసిన నేహా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం ప్రోమోలో వైరల్ అయింది.

ఈ అనూహ్య పరిణామంతో నేహా బిగ్ బాస్ హౌస్ నుంచి నిజంగానే బయటకు వచ్చేసిందా? లేదా మోహన్ లాల్ నచ్చజెప్పి ఆటలో కొనసాగించారా..? అన్నది తెలుసుకోవడానికి ప్రేక్షకులు, నెటిజన్లు రాబోయే ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.