Bigg Boss 10: బిర్యానీ కోసం ఒక జట్టు.. గంజితో మరో జట్టు.. బిగ్ బాస్ కెప్టెన్‌గా అమన్‌కు పట్టాభిషేకం

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 డే 75 ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుద్ధిశాలి, బలశాలి టాస్కులో అమన్‌ విజయం సాధించాడు

CR Reddy
Published on: 21 Nov 2026 7:15 AM IST
Aman Masud
X

Aman Masud 

Bigg Boss 10: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో పదకొండో వారం ఆట రసవత్తరంగా సాగుతోంది. డే 75, ఎపిసోడ్‌ 76లో ఇంటి సభ్యుల మధ్య పోటీతో పాటు భావోద్వేగాలు, వాదనలు చోటుచేసుకున్నాయి. బుద్ధిశాలి, బలశాలి టాస్కులో అమన్‌ గెలవడంతో ఒక జట్టుకు బిర్యానీ దక్కింది. ఓడిన జట్టు మాత్రం గంజితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు వర్షిణి పదే పదే బ్యాటరీలు మార్చుకోకపోవడంతో బిగ్‌బాస్‌ ఆమెకు శిక్ష విధించాడు. చివరికి కెప్టెన్సీ పోటీలో అమన్‌ విజయం సాధించి కొత్త కెప్టెన్‌గా నిలిచాడు.

బరువు మోసే టాస్కులో అమన్‌దే పైచేయి

బుద్ధిశాలి, బలశాలి టాస్కులో రామ్‌ ప్రసాద్‌, అమన్‌ పోటీపడ్డారు. ఇందులో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు ఎక్కువ బరువును కొంతసేపు మోయాల్సి వచ్చింది. రామ్‌ ప్రసాద్‌ బరువు మోయలేక మధ్యలోనే వదిలేయగా.. అమన్‌ మాత్రం ఎక్కువసేపు దానిని మోశాడు. అయితే ఈ పోటీకి సంచాలకుడిగా ఉన్న ముకేష్‌ మొదట తన జట్టులోని రామ్‌ ప్రసాద్‌ గెలిచినట్లు ప్రకటించాడు. ప్రశ్నలకు ఎక్కువ సమాధానాలు చెప్పింది, బరువు ఎక్కువసేపు మోసింది అమన్‌ అని మరో సంచాలకుడు వంశీ అభ్యంతరం తెలిపాడు. అయినా ముకేష్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో బిగ్‌బాస్‌ జోక్యం చేసుకుని ముకేష్‌ను మందలించాడు. ఆ తర్వాత అమన్‌నే విజేతగా ప్రకటించారు.

బిర్యానీ ఒకవైపు.. గంజి మరోవైపు

టాస్కులో గెలిచిన జట్టుకు బిగ్‌బాస్‌ బిర్యానీ పంపించగా.. ఓడిన జట్టుకు గంజి ఇచ్చాడు. నరేష్‌ గంజి తింటుండటాన్ని చూసి రామ్‌ ప్రసాద్‌ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో త్రిగుణ్‌ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు నరేష్‌ను తీసుకొచ్చి రామ్‌ ప్రసాద్‌ ఎదుటే బిర్యానీ తినిపించాడు. ఈ పరిణామం ఇంట్లో చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఇంటి పనులు, శుభ్రత విషయంలోనూ సభ్యుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. పనులు సరిగా చేయడం లేదని ముకేష్‌ జట్టుపై చర్చించుకున్నారు. ఆర్కేనే శుభ్రం చేయాలని త్రిగుణ్‌ ఆదేశించడంతో మరోసారి ఇంట్లో మాటల యుద్ధం మొదలైంది.

వర్షిణిని చీకటి గదిలో బంధించిన బిగ్‌బాస్‌

ఇంటి పనుల విషయంలో వర్షిణి ఆసక్తి చూపకపోవడంపై కూడా చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, పదే పదే చెప్పినా తన బ్యాటరీలు మార్చుకోవడం లేదనే కారణంతో బిగ్‌బాస్‌ ఆమెకు శిక్ష విధించాడు. వర్షిణిని కొంతసేపు స్టోర్‌ రూమ్‌లో ఉంచి లైట్లు ఆఫ్‌ చేశారు. చీకటిలో ఉండటంతో ఆమె భయపడింది. కొంతసేపు ఆమెను అక్కడే ఉంచిన తర్వాత బయటకు పంపించారు. మరోవైపు కెప్టెన్సీ పోటీలో ఎవరు పాల్గొనాలనే అంశంపై ముకేష్‌, త్రిగుణ్‌ తమ జట్టు సభ్యులతో చర్చించారు. ముకేష్‌ జట్టు నుంచి నీతూకు అవకాశం ఇవ్వాలా వద్దా అనే విషయంలోనూ చర్చ జరిగింది. ఆ తర్వాత ముకేష్‌, ఆర్కే, నీతూ పాల్గొన్న స్టడీ అండ్‌ బ్యాలెన్స్‌ టాస్కులో నీతూ విజయం సాధించింది. అయితే తాను కావాలనే ఓడిపోయానని ముకేష్‌ సుధీర్‌తో చెప్పుకున్నాడు.

కెప్టెన్సీ రేసులో నలుగురు

కెప్టెన్సీ పోటీకి త్రిగుణ్‌ జట్టు నుంచి ముగ్గురు, ముకేష్‌ జట్టు నుంచి ఒకరు పాల్గొనే అవకాశం లభించింది. ముకేష్‌ జట్టు నుంచి నీతూ పోటీకి రాగా.. త్రిగుణ్‌ జట్టు నుంచి దేబ్జానీ, అమన్‌, శివ్‌ బరిలోకి దిగారు. ఈ నలుగురికి బిగ్‌బాస్‌ 'నిలబెట్టు.. పడగొట్టు' అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో అమన్‌ మిగతా వారికంటే వేగంగా ఆటను పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో పదకొండో వారానికి కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అంతేకాదు, పదమూడో వారంలో జరగనున్న టికెట్‌ టు ఫినాలే పోటీకి తొలి కంటెండర్‌గా కూడా నిలిచాడు. ఈ విజయంతో అమన్‌కు కెప్టెన్సీతో పాటు ఫినాలే దిశగా మరో కీలక అవకాశం లభించినట్లయింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.