Bigg Boss 10: అమన్, ముఖేష్‌లకు నాగార్జున క్లాస్.. వర్షిణి కన్నీళ్లు.. త్రిగుణ్‌కు గట్టి వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు 10 వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. వర్షిణి కన్నీళ్లకు కారణమైన త్రిగుణ్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు.
Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటోంది. దీంతో హౌస్‌లో పోటీ మరింత పెరిగింది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, మాటల యుద్ధాలు, భావోద్వేగాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరి ఆటతీరుపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా వర్షిణి, త్రిగుణ్ మధ్య జరిగిన వివాదం, కెప్టెన్ అమన్ ప్రవర్తన, ముఖేష్ ఆటతీరుపై ఆయన గట్టిగా మాట్లాడారు. కొన్ని వీడియోలు చూపిస్తూ కంటెస్టెంట్లకు క్లారిటీ ఇచ్చారు.
వర్షిణి కన్నీళ్లు.. త్రిగుణ్ మాటలపై నాగార్జున ప్రశ్నలు
హౌస్‌లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని నాగార్జున అడగడంతో వర్షిణి భావోద్వేగానికి గురయ్యారు. తొమ్మిది మంది ఒకవైపు, ఇద్దరు మరోవైపు ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. తమపై కొందరు గ్యాంగ్‌గా ఏర్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం ఏమిటని నాగార్జున అడగ్గా, తన క్యారెక్టర్ గురించి వచ్చిన వ్యాఖ్యలే బాధించాయని వర్షిణి తెలిపారు. త్రిగుణ్ తనను ఉద్దేశించి చీప్ క్యారెక్టర్ అన్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫ్రెండ్‌షిప్ విషయంలో ఆ మాట అన్నానని త్రిగుణ్ తర్వాత వివరించాడా అని నాగార్జున ప్రశ్నించారు. వర్షిణి చెప్పిన సమాధానం తర్వాత సంబంధిత వీడియోను ప్లే చేశారు. అందులో త్రిగుణ్ తన ఉద్దేశాన్ని వివరించినట్లు కనిపించడంతో, ఆ విషయాన్ని వర్షిణికి నాగార్జున గుర్తుచేశారు.
త్రిగుణ్‌కు క్షమాపణ చెప్పాలని సూచన
ఆ తర్వాత త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున.. వర్షిణి మనసు నొచ్చుకునేలా మాట్లాడిన విషయంపై ప్రశ్నించారు. ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇవ్వని వ్యక్తిగా వర్షిణి తన గురించి భావించినట్లే, ఆమె గురించి త్రిగుణ్ కూడా అలాంటి అభిప్రాయంతో ఉన్నట్లు నాగార్జున చెప్పారు. ఈ పరిస్థితిలో ఇద్దరూ తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా వర్షిణికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని త్రిగుణ్‌ను కోరారు. దీంతో ఈ వివాదం వీకెండ్ ఎపిసోడ్‌లో ప్రధాన చర్చగా మారింది.
కెప్టెన్ అమన్ ప్రవర్తనపై నాగార్జున ఫైర్
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమన్ ప్రవర్తనలో మార్పు వచ్చిందా అని నాగార్జున ప్రశ్నించారు. తాను అలాంటిదేమీ చేయలేదని అమన్ సమాధానం ఇచ్చారు. అయితే ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు అతని అసలు స్వభావం బయటపడుతుందని నాగార్జున అన్నారు. అమన్, ముఖేష్ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోను చూపించారు. ముఖేష్‌ను పట్టుకుని 'ఏంటి గబ్బు' అంటూ మాట్లాడటంపై అమన్‌ను నిలదీశారు. పాలు వేడి చేసే సమయంలో జరిగిన గొడవను అమన్ వివరించారు. తాను శుభ్రం చేస్తుండగా ముఖేష్ వచ్చి 'బ్రెయిన్‌లెస్' అని అన్నాడని, అందుకే కోపం వచ్చిందని చెప్పారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ కెప్టెన్ పదవి అంటే అధికారం కాదని, అది బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు.
ముఖేష్‌కు స్టార్‌డమ్ గురించి నాగార్జున హెచ్చరిక
ముఖేష్‌తోనూ నాగార్జున మాట్లాడారు. అతనికి స్టార్‌డమ్ ఉందని చెబుతూ, హౌస్‌లో అతని ప్రవర్తన ఎలా ఉండాలో సూచించారు. చాలామంది అభిమానించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆటలోనూ, మాటల్లోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ముఖేష్ బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ఘటనపై వర్షిణిని ప్రశ్నించారు. తన బట్టలు కూడా అందులో ఉన్నాయని, 24 గంటలు కూడా గడవకముందే వాటిని పడేశారని ఆమె వివరించారు. ఈ వ్యవహారంలో ఎవరి తప్పు ఎంత ఉందో నాగార్జున చర్చించారు. ముఖేష్‌ను ఇష్టపడే అభిమానులు అతని ప్రవర్తన వల్ల దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవాలంటే ఆటతీరుతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమని చెప్పారు.
స్నేక్ టాస్క్, బాస్కెట్ ఫౌల్‌పై చర్చ
వీకెండ్ ఎపిసోడ్‌లో టాస్కుల విషయంలోనూ నాగార్జున కంటెస్టెంట్లను ప్రశ్నించారు. స్నేక్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారని అడగ్గా, అమన్ త్రిగుణ్ పేరు చెప్పారు. అయితే త్రిగుణ్ బాగా ఆడితే ఆ రౌండ్‌లో ఆర్కే ఎలా గెలిచాడని నాగార్జున ప్రశ్నించారు. బాక్స్ కింద పడిన తర్వాత దాన్ని తీసుకోవచ్చా అనే అంశంపై వీడియో చూపించి వివరించారు. అలాగే బాస్కెట్‌లో ఉన్న బంతిని లాగిన ఘటనపైనా చర్చించారు. ఆర్కే తన వాదన వినిపించగా, సంచాలక్‌గా ఉంటే బాస్కెట్‌ను లాగడాన్ని ఫౌల్‌గా పరిగణిస్తానని వర్షిణి చెప్పారు.
ఈ డిస్కషన్స్ తర్వాత హౌస్ మేట్లను గార్డెన్ ఏరియాలోకి రమ్మని నాగార్జున చెప్పారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉందని షాకిచ్చాడు. నామినేషన్లలో ఉన్న వర్షిణి, ముకేశ్, వంశీ, రాంప్రసాద్, దేబ్జానీ, త్రిగుణ్, రామకృష్ణ వరసగా నిలబడగా వాళ్ల ముందు కొన్ని బాక్సులు పెట్టారు. వీటిని పగలగొట్టినప్పుడు అందులో ఎవరి బాక్సులోని అక్షరాలతో EXIT పదం పూర్తవుతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు అని నాగ్ చెప్పాడు. అలా వంశీ ఎలిమినేట్ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన తర్వాత వంశీ, నాగార్జునతో మాట్లాడుతూ నా కూతురిని కలిసినట్లు ఉదయమే కల వచ్చింది. అదే ఇప్పుడు నిజం కాబోతుందని అన్నాడు. తన ఫ్రెండ్ త్రిగుణ్‌తో టీవీలో మాట్లాడుతూ.. కప్పు కొట్టి తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అని అన్నాడు.




