Bigg Boss 10: ముకేష్‌కి ఫ్యామిలీ వీక్ ఛాన్స్.. వర్షిణి త్యాగం, నరేష్ లెక్కలతో హౌస్‌లో హైడ్రామా
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ సమీపిస్తుండటంతో హౌస్‌లో టాస్కులు, గొడవలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
Vamsi New Captain
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ సమీపిస్తుండటంతో హౌస్‌లో టాస్కులు, గొడవలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. 61వ రోజు ఎపిసోడ్‌లో ఒకవైపు కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కోసం కంటెస్టెంట్లు పోటీపడితే.. మరోవైపు కెప్టెన్సీ పోరులో వంశీ విజయం సాధించాడు. ముకేష్, వర్షిణి జంటకు సంబంధించిన టాస్క్‌లో నరేష్ తీసుకున్న నిర్ణయం మాత్రం హౌస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. వర్షిణి తనకు వచ్చిన అవకాశాన్ని ముకేష్ కోసం వదులుకోవడం, అమన్, ఆర్కే అభ్యంతరాలు చెప్పడంతో ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఫుడ్ విషయంలో త్రిగుణ్, వర్షిణి మధ్య గొడవ
అంతకుముందు హౌస్‌లో ఆహారం వృథా చేస్తున్నారనే అంశంపై త్రిగుణ్, వర్షిణి మధ్య వాగ్వాదం జరిగింది. వర్షిణి ఫుడ్ వేస్ట్ చేస్తోందని భావించిన త్రిగుణ్.. ఆమెకు టీ ఇవ్వకుండా శిక్ష విధించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ విషయంలో వర్షిణికి మద్దతుగా ముకేష్ రంగంలోకి దిగాడు. త్రిగుణ్‌తో వాదనకు దిగడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య పలు విషయాల్లో విభేదాలు ఉండటంతో ఈ గొడవ కూడా హౌస్‌లో చర్చనీయాంశమైంది.
ఫ్యామిలీని కలిసేందుకు బిగ్ బాస్ మరో అవకాశం
రివెంజ్ అండ్ రివార్డ్ టాస్క్‌లో భాగంగా గెలిచిన కంటెస్టెంట్లకు వచ్చే వారం తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పిస్తామని బిగ్ బాస్ ప్రకటించారు. అయితే రివెంజ్‌కు గురైన ఆర్కే, అమన్, వర్షిణి, ముకేష్‌లకు తొలుత ఈ అవకాశం దక్కలేదు. దీంతో వారికి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆర్కే, అమన్ ఒక జంటగా, ముకేష్, వర్షిణి మరో జంటగా ఏర్పడ్డారు. ఈ రెండు జంటలకు ప్రత్యేక టాస్క్ ఇచ్చి, గెలిచిన జంటలో ఒక్కరికి మాత్రమే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ స్పష్టం చేశారు. దీంతో ఈ టాస్క్‌పై అందరి దృష్టి పడింది.
ముకేష్, వర్షిణి విజయం.. నరేష్ నిర్ణయంపై వివాదం
ఈ టాస్క్‌లో ఒకరు స్టాండ్‌ను బ్యాలెన్స్ చేస్తుండగా, మరొకరు ఇటుకలతో ఇంటి ఆకారాన్ని నిర్మించాలి. నిర్ణీత సమయం పాటు నిర్మాణం నిలబడితే విజయం సాధించినట్లుగా లెక్క. ముందుగా ముకేష్, వర్షిణి తమ టాస్క్‌ను పూర్తి చేశారు. అయితే వారు నిర్మించిన ఇటుకల ఇల్లు ఐదు సెకన్ల లెక్క పూర్తయ్యేలోపే కూలిపోయిందని అమన్, ఆర్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగో నంబర్ చెప్పే సమయంలోనే ఇటుకలు పడిపోయాయని వారు వాదించారు. కానీ సంచాలకుడిగా వ్యవహరించిన నరేష్ మాత్రం ఐదు సెకన్ల లెక్క పూర్తయిన తర్వాతే కూలిందని భావించి ముకేష్, వర్షిణి జంటను విజేతలుగా ప్రకటించాడు. దీంతో నిర్ణయంపై హౌస్‌లో తీవ్ర వాగ్వాదం జరిగింది. తన నిర్ణయం తప్పయితే శనివారం ఎపిసోడ్‌లో శిక్షకు సిద్ధమని నరేష్ గట్టిగా చెప్పాడు.
ముకేష్ కోసం వర్షిణి త్యాగం.. వంశీ కొత్త కెప్టెన్
విజయం సాధించిన ముకేష్, వర్షిణి జంటలో కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న ఎదురైంది. ఈ సమయంలో వర్షిణి తన అవకాశాన్ని వదులుకుని ముకేష్‌కు ఫ్యామిలీ వీక్ ఛాన్స్ ఇచ్చింది. దీంతో ముకేష్ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం దక్కించుకున్నాడు. మరోవైపు అమన్, ఆర్కే మాత్రం తమకు అన్యాయం జరిగిందని భావించారు. ఈ వివాదం వచ్చే వీకెండ్‌లో నాగార్జున దగ్గరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక కెప్టెన్సీ పోరులో త్రిగుణ్, దేబ్జానీ, శ్వేత, వంశీ పోటీపడ్డారు. హౌస్ సభ్యుల మద్దతు ఎక్కువగా వంశీకి లభించడంతో అతడు విజయం సాధించి కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మరోవైపు ఇప్పటివరకు నరేష్ ఆటతీరును నాగార్జున ప్రశంసిస్తూ వస్తున్నారు. ఈ టాస్క్ వివాదంపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.




