Bigg Boss 10: కెప్టెన్సీ టాస్క్‌లో రచ్చ రచ్చ.. త్రిగుణ్‌కు పట్టం, సుధీర్ ఎలిమినేషన్‌కు బ్రేక్

Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్, సడెన్ ఎలిమినేషన్‌తో ఒక్కరోజులోనే ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి.

CR Reddy
Published on: 31 Oct 2026 8:02 AM IST
Bigg Boss Telugu
X

 Bigg Boss Telugu

Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్, సడెన్ ఎలిమినేషన్‌తో ఒక్కరోజులోనే ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులుగా సాగుతున్న కెప్టెన్సీ పోరులో చివరకు త్రిగుణ్ విజయం సాధించి అల్టిమేట్ గోట్‌గా నిలిచాడు. ఇకపై హౌస్‌లో ఉన్నంతకాలం కెప్టెన్సీ కంటెండర్ పోటీలో నేరుగా పాల్గొనే అవకాశం కూడా అతడికి దక్కింది. మరోవైపు గ్రీన్ లెవల్‌లో ఉన్న అమన్‌కు మాత్రం కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం రాలేదు. గతంలో నాగార్జున విధించిన పనిష్మెంట్ ఇంకా అమల్లో ఉండటంతో అతడు నిరాశకు గురయ్యాడు. ఇదే సమయంలో రోహిత్‌తో అమన్‌కు పెద్ద గొడవ జరగడం హౌస్‌లో కొత్త చర్చకు దారితీసింది.

అమన్‌కు కెప్టెన్సీ టాస్క్‌లో షాక్

గ్రీన్ లెవల్ సభ్యులకు బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు. ఇందులో పోటీదారులు ముగ్గురు సపోర్టర్లను ఎంచుకోవాలి. కంటెండర్లు బంతిని పోల్‌పై పెట్టుకుని తీసుకెళ్లి సపోర్టర్లకు అందించాలి. వారు బోర్డులో బంతిని వేయాలి. బంతి పడిన చోట వచ్చే సూచనల ప్రకారం పోటీదారుల కటౌట్లను ముందుకు జరపాలి. చివరకు ఎవరి కటౌట్ ముందుగా గమ్యానికి చేరుతుందో వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌లో గెలిచిన వారికి కెప్టెన్సీతో పాటు హౌస్‌లో ఉన్నంతకాలం కెప్టెన్సీ పోటీలో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే అమన్ గ్రీన్ లెవల్‌లో ఉన్నప్పటికీ గతంలో విధించిన కెప్టెన్సీ నిషేధం కారణంగా పోటీకి దూరమయ్యాడు. దీంతో అతడు ఎమోషనల్ అయ్యాడు.

అమన్, రోహిత్ మధ్య మాటల యుద్ధం

సపోర్టర్ల ఎంపిక సమయంలో అమన్, రోహిత్ మధ్య వివాదం మొదలైంది. త్రిగుణ్ గెలవాలని అమన్ కోరుకోవడంతో పాటు అతడికి సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే రోహిత్, ముకేశ్ పేర్ల విషయంలో చర్చ జరగడంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అమన్ రోహిత్‌ను కన్నింగ్ అంటూ విమర్శించగా, రోహిత్ కూడా ఘాటుగా స్పందించాడు. ఇన్నాళ్లు తన వల్లే అమన్‌కు గుర్తింపు వచ్చిందన్నట్టుగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. చివరకు ఓటింగ్ ద్వారా అమన్‌ను సపోర్టర్‌గా ఎంపిక చేశారు. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య స్నేహం దెబ్బతిన్నట్లు కనిపించింది.

త్రిగుణ్ గెలుపు.. ముకేశ్ అసహనం

టాస్క్‌లో అమన్, వంశీ, శివ సపోర్టర్లుగా నిలిచారు. ముకేశ్ వేగంగా ఆడినా సపోర్టర్ల నుంచి ఆశించిన సహకారం అందలేదని అసహనం వ్యక్తం చేశాడు. వంశీ మాత్రం త్రిగుణ్ గెలవాలని ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు త్రిగుణ్ విజయం సాధించాడు. దీంతో అతడికి అల్టిమేట్ గోట్ హోదాతో పాటు కెప్టెన్సీ బ్యాండ్ దక్కింది. హౌస్‌లో ఉన్నంతకాలం ప్రతి కెప్టెన్సీ పోటీలో నేరుగా పాల్గొనే అవకాశం కూడా లభించింది. త్రిగుణ్ గెలుపుపై ముకేశ్ పెద్దగా స్పందించకపోయినా, రోహిత్ మాత్రం అతడిపై విమర్శలు చేశాడు. లక్ వల్లే గెలిచావంటూ త్రిగుణ్‌ను టార్గెట్ చేశాడు.

సుధీర్ ఎలిమినేషన్.. చివర్లో మ్యాజిక్ ట్విస్ట్

కెప్టెన్సీ టాస్క్ ముగిసిన వెంటనే బిగ్‌బాస్ సడెన్ ఎలిమినేషన్ ప్రకటించాడు. రెడ్ లెవల్‌లో ఉన్న ఝాన్సీ, శ్వేత, రామకృష్ణ, రోహిత్, సుధీర్‌లలో ఒకరిని బయటకు పంపాల్సి ఉంటుందని చెప్పాడు. గ్రీన్ సభ్యులు ఒక్కొక్కరి తలపై బాటిల్ పగలగొట్టి తమ నిర్ణయానికి కారణం చెప్పారు. అయితే చివరి నిర్ణయం ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఉంటుందని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. తక్కువ ఓట్లు రావడంతో సుధీర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అతడు బయటకు వెళ్లే సమయంలో ముకేశ్ తన మ్యాజిక్ పవర్ ఉపయోగించాడు. ఆ పవర్‌తో ఝాన్సీ దగ్గర ఉన్న ఎలిమినేషన్ ఫ్రీ అవకాశాన్ని మళ్లీ ఉపయోగించేలా చేశాడు. ఝాన్సీ ఆ అవకాశాన్ని సుధీర్ కోసం వినియోగించడంతో అతడు మరో వారం హౌస్‌లో ఉండే అవకాశం దక్కించుకున్నాడు.

హౌస్‌లో మారిన స్నేహాలు

ఈ ఎపిసోడ్‌తో హౌస్‌లో సంబంధాలు మారుతున్నట్లు కనిపించాయి. అమన్, రోహిత్ మధ్య స్నేహం బలహీనపడగా, ముకేశ్, రోహిత్ ఒకే వైపు ఉన్నారనే చర్చ మొదలైంది. మరోవైపు వంశీ త్రిగుణ్‌కు మద్దతుగా నిలిచాడు. త్రిగుణ్ కెప్టెన్ కావడంతో రోహిత్ అసహనం వ్యక్తం చేయడం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అమన్ గతంలో త్రిగుణ్‌కు మద్దతు ఇవ్వడం, హోటల్ టాస్క్‌లో స్టార్స్ విషయంలో జరిగిన పరిణామాలు కూడా ఈ విభేదాలకు కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కెప్టెన్సీతో మొదలైన ఈ ఎపిసోడ్ స్నేహాలు, గొడవలు, ఎలిమినేషన్ ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా సాగింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.