Off The Record: ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష.. టార్గెట్ వేరే ఉందా ?

Off The Record: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల దీక్షకు కమలదళం సిద్ధమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2026 9:37 AM IST
Off The Record
X

Off The Record: ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష.. టార్గెట్ వేరే ఉందా ? 

Off The Record: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అవును.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. విద్యార్థులకు పీడకలగా మారుతున్నాయా..? కాలేజీలకు ఫీజులు రాక.. యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయా..? విద్యార్థులు, తల్లిదండ్రులు.. ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారా..?

ఇదే అంశాన్ని ఇప్పుడు బీజేపీ రాజకీయ అస్త్రంగా మార్చుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టిన కమలదళం.. ఇప్పుడు దీక్షకు సిద్ధమైంది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు.. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వయంగా 48గంటల దీక్షకు కూర్చోనున్నారు.

25న సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఇది ఒక్క నాయకుడి దీక్ష కాదు.. పార్టీ మొత్తం కలిసి చేసే పొలిటికల్ ప్రెజర్ గేమ్‌. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. కానీ ఈ దీక్ష వెనుక మరో టార్గెట్ ఉందని రాజకీయ విశ్లేషకుల టాక్.

విద్యార్థుల ఫీజు సమస్యను రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలంటే.. సమస్యను ప్రజలు, విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలి. అందుకే బీజేపీ ‘ఫీజు బకాయి..

బీజేపీ లడాయి’ అంటూ దీక్ష రంగంలోకి దిగుతోందట. ఇక సంతకాల నుంచి దీక్ష దాకా బీజేపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది సంతకాలు సేకరించినట్లు పార్టీ చెబుతోంది. ఇక ఆ సంతకాలతో గవర్నర్‌ను కలవాలని నిర్ణయించిందట పార్టీ అధిష్టానం.

అయితే.. ఫీజు బకాయిల పోరాటం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయా..? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. యువత ఓటు ఇప్పుడు ఏ పార్టీకి అయినా కీలకమే. ముఖ్యంగా గ్రాడ్యుయేట్‌ ఓటర్లు.. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత.

వీళ్లను టార్గెట్‌ చేసుకుని బీజేపీ తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నట్టు తెలుస్తోంది‌‌. విద్య, ఉద్యోగాలు, ఉపాధి, ఫీజులు.. యువత జీవితాలను నేరుగా ప్రభావితం చేసే అంశాలు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాన్ని కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాకుండా.. యువతతో పార్టీకి అనుసంధానం పెంచుకునే రాజకీయ వేదికగా మలచాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

విద్యార్థుల సమస్యను జనంలోకి తీసుకెళ్లి.. యువ ఓటర్లలో పట్టు పెంచుకోవాలన్నది కమల వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాబోయే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ యువతపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వ్యూహం ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నదే అసలు ప్రశ్నగా మారిందంటున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో యువ ఓటర్లు.. ముఖ్యంగా జెన్‌ జీ ఓటర్లు.. ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. చేతిలో మొబైల్.. నిమిషానికో రీల్. క్షణాల్లో ఒక విషయం వైరల్‌... ఇలాంటి జనరేషన్‌తో కనెక్ట్ అవ్వాలంటే.. పాత రాజకీయ ఫార్ములాలు సరిపోవు.

అందుకే బీజేపీ కూడా కొత్త రూట్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు.. యువతకు సంబంధించిన అంశాలపై పోరాటాలు.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. ఇవన్నీ ఒకే టార్గెట్‌తో సాగుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. జీహెచ్‌ఎంసీ.. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో యువ ఓటర్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల రాజకీయం అంటే కేవలం ఓట్ల లెక్క కాదు.

ఓటరు మనసులో ఎవరి పేరు నిలుస్తుందన్నదే అసలు లెక్క. అందుకే బీజేపీ ఇప్పుడు ఫీజు బకాయిల అంశాన్ని రాజకీయంగా మరింత పెద్దదిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ లడాయిలో బీజేపీకి రాజకీయంగా లాభం చేకూరుతుందా..? లేక ప్రభుత్వం సమయానికి బకాయిలు విడుదల చేసి బీజేపీ పోరాటానికి చెక్ పెడుతుందా..? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇక దీక్ష జరిగే రెండు రోజులూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఫీజు బకాయిల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారట. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారం క్రమంగా రాజకీయ పోరాటంగా మారనుంది.

ఎన్నికల వేడి పెరగకముందే.. ఫీజు బకాయిల ఫైలు తెలంగాణ పాలిటిక్స్‌లో మరో హాట్ ఫైల్‌గా మారొచ్చు. ఇంతకీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరాటం ఇక దీక్షతో ఎటువంటి కొత్త మలుపు తిరగనుందో..? చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story