Tusshar Kapoor: బాలీవుడ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ భీభత్సం.. టైగర్ ష్రాఫ్ తర్వాత మరో స్టార్ హీరోకు బెదిరింపులు!
Tusshar Kapoor: బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు. రూ.5 కోట్లు ఇవ్వాలని హ్యారీ బాక్సర్ వార్నింగ్, ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు.
Tusshar Kapoor: బాలీవుడ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ భీభత్సం.. టైగర్ ష్రాఫ్ తర్వాత మరో స్టార్ హీరోకు బెదిరింపులు!
Tusshar Kapoor: బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాల్పులకు పాల్పడిన ఘటన సృష్టించిన కలకలం మానకముందే, తాజాగా మరో నటుడిని ఆ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌ను బెదిరిస్తూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడైన ‘హ్యారీ బాక్సర్’ పేరిట ఓ వ్యక్తి తుషార్ కపూర్‌కు నేరుగా ఫోన్ చేసి తమకు తక్షణమే రూ. 5 కోట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో హత్య చేస్తామని తీవ్రంగా హెచ్చరించాడు. హఠాత్తుగా వచ్చిన ఈ కాల్‌తో అప్రమత్తమైన తుషార్ కపూర్, వెంటనే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే నటుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందుజాగ్రత్త చర్యగా ఈ విషయాన్ని వారం రోజుల పాటు అత్యంత రహస్యంగా ఉంచినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని కాల్ డేటా ఆధారంగా ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ముంబయిలోని ఆయన నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. అగ్ర నటుడు జీతేంద్ర కుమారుడు, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోదరుడైన తుషార్ కపూర్ బాలీవుడ్‌లో ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా పలు విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
వరుసగా సినీ ప్రముఖులనే లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు, దాడులకు తెగబడుతుండటంతో ముంబయి చిత్ర పరిశ్రమలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.




