Chalti Ka Naam Gaadi Story: ట్యాక్స్ కట్టలేక సినిమాను ప్లాప్ చేద్దామనుకున్నారు...కానీ రివర్స్‌లో
ట్యాక్స్ కట్టలేక సినిమాను ప్లాప్ చేయాలని తీస్తే...అది బాలీవుడ్‌లోనే ఆల్‌టైమ్ క్లాసిక్ కామెడీగా నిలిచింది. సినిమా హిట్ కావడం అదృష్టమే అయినా... ఆ హీరోకు దాని వలన చాలా నష్టపోవలసి వచ్చింది.
Chalti Ka Naam Gaadi Story: సినిమా రంగంలో ప్రొడ్యూసర్లు తమ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, కోట్లు కొల్లగొట్టాలని కోరుకుంటారు. కానీ, ఒక స్టార్ హీరో మాత్రం తన సినిమా అట్టర్ ప్లాప్ అవ్వాలని, బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా నష్టాలు రావాలని కోరుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది వంద శాతం నిజం! ఆ హీరో ఎవరో కాదు... బాలీవుడ్ లెజెండ్రీ సింగర్ కమ్ యాక్టర్ కిషోర్ కుమార్. ఆయన నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'చల్తీ కా నామ్ గాడీ' వెనుక ఉన్న ఈ రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి కిషోర్ కుమార్ ఆ సమయంలో భారీగా ఆదాయపు పన్ను సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ట్యాక్స్ కట్టడం ఇష్టం లేక, తన అకౌంట్లలో భారీ నష్టాలను చూపించాలని ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఒక సినిమా తీసి, దానిని డిజాస్టర్ చేస్తే చట్టబద్ధంగా నష్టాలు చూపించవచ్చని భావించారు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది.
ప్లాప్ చేయాలని తీస్తే... రికార్డు కలెక్షన్లు!
ఈ వ్యూహంతోనే కిషోర్ కుమార్ తన ఇద్దరు అన్నలు అశోక్ కుమార్, అనూప్ కుమార్‌లతో కలిసి, అప్పటి టాప్ హీరోయిన్ మధుబాల ముఖ్య పాత్రలో 'చల్తీ కా నామ్ గాడీ' సినిమాను నిర్మించారు. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని నమ్మి, దీనితో పాటు ఒక బెంగాలీ సినిమాను కూడా సమాంతరంగా విడుదల చేశారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది! ఈ సినిమా థియేటర్లలోకి రాగానే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కిషోర్ కుమార్ కామెడీ టైమింగ్, మధుబాల గ్లామర్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఆ సంవత్సరంలో బాలీవుడ్‌లోనే రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ట్యాక్స్ తప్పించుకోవడానికి నష్టాలు ఆశించిన కిషోర్ కుమార్‌కు, ఈ సినిమా తెచ్చిపెట్టిన భారీ లాభాలతో ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మళ్లీ పెద్ద షాక్ ఇచ్చింది.
ఆరు దశాబ్దాలు దాటినా మారుమోగుతున్న పాటలు
ఈ సినిమా విడుదలై దాదాపు ఆరు దశాబ్దాలు దాటిపోయింది. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. సచిన్ దేవ్ బర్మన్ స్వరకల్పనలో వచ్చిన ప్రతీ పాట బాలీవుడ్ గోల్డెన్ ఎరాలో మైలురాయిగా నిలిచింది. హాల్ కైసా హై జనాబ్ కా, ఇక్ లడ్కీ భీగీ భాగీ సీ, పాంచ్ రూపయా బారా ఆనా, హమ్ థే వో థీ ఔర్ సమా రంగీన్ అనే పాటలంటే బాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఇప్పటికీ చెవికోసుకుంటారు. ఎక్కడో ఒకచోట ఈ పాటలు ఇప్పటికీ వీనులకు వినిపిస్తూనే ఉంటాయి. పాపం ప్లాప్ అవ్వాలని కోరుకుంటూ తీసిన ఒక సినిమా, భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ కామెడీ క్లాసిక్‌గా నిలిచిపోవడం అనేది కేవలం కిషోర్ కుమార్ జీవితంలోనే సాధ్యమైన ఒక విచిత్రమైన మేజిక్! ఇది అందరికీ సాధ్యం అవుతుందా అంటే కాదనే చెబుతాం.




