Actor Arya : రూ.1.80 కోట్లు ఎగవేత.. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో హీరో ఆర్య పై చీటింగ్ కేసు

Actor Arya : తమిళ స్టార్ హీరో ఆర్యపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. షూటింగ్ పరికరాల అద్దె బకాయిలు రూ.1.80 కోట్లు ఎగ్గొట్టడంతో కేసు పెట్టారు.

CR Reddy
Published on: 12 July 2026 8:05 AM IST
Actor Arya
X

Actor Arya 

Actor Arya : సినీ పరిశ్రమలో మరో వివాదం కలకలం రేపుతోంది. ప్రముఖ తమిళ కథానాయకుడు ఆర్యతో పాటు ఆయన నటిస్తున్న ఒక సినిమా నిర్మాతలపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా చిత్రీకరణ కోసం అద్దెకు తీసుకున్న అత్యాధునిక షూటింగ్ పరికరాలకు సంబంధించిన బకాయిలను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి హైలాంకాలనీకి చెందిన తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిణామం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

షూటింగ్ కెమెరాల అద్దె రూ.1.80 కోట్లు ఎగవేత

పోలీసుల కథనం ప్రకారం.. నటుడు ఆర్య ముఖ్య పాత్రలో అనంతన్ కాడు అనే మలయాళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఖరీదైన డిజిటల్ కెమెరాలు, అత్యాధునిక లైటింగ్ యూనిట్లను అద్దెకు ఇచ్చేందుకు 2025 ఫిబ్రవరిలో నటుడు ఆర్య, నిర్మాత వినోద్ సదరు తాహెర్ సినీ టెక్నిక్ సంస్థను సంప్రదించారు. ఒప్పందం కుదిరిన తర్వాత, సదరు సంస్థ తన సొంత ఖర్చులతో ఈ భారీ షూటింగ్ పరికరాలన్నింటినీ హైదరాబాద్ నుంచి కేరళలోని లొకేషన్లకు తరలించింది. మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత పరికరాల అద్దె రూ.2.12 కోట్లుగా తేలింది. అయితే, ఇందులో మెజారిటీ వాటా అయిన రూ.1.80 కోట్లకు పైగా బకాయిలను చిత్రబృందం చెల్లించకుండా ఎగవేసిందని బాధితులు పేర్కొన్నారు.

బాకీ డబ్బులు అడిగితే బెదిరింపులు

ఈ వ్యవహారంపై సదరు సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సినిమా విడుదలకు ముందే మొత్తం బకాయిలు చెల్లించి, సంస్థ నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకుంటామని హీరో, నిర్మాత సంతకాలతో కూడిన ఒప్పంద పత్రాలు రాసిచ్చారని ఆయన తెలిపారు. అయితే, షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. బకాయిల చెల్లింపు విషయమై గత కొన్ని రోజులుగా పలుమార్లు ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ ద్వారా సంప్రదించినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. పైగా, తమ సంస్థ మేనేజర్ బాకీ డబ్బుల గురించి గట్టిగా అడగ్గా.. నటుడు ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య పీఏ కిశోర్ కలిసి ఆయనను బెదిరించారని ఫిర్యాదులో వివరించారు.

కేరళ కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు

తమకు రావాల్సిన రూ.1.80 కోట్ల భారీ మొత్తాన్ని ఎగ్గొట్టడమే కాకుండా, వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి నటుడు ఆర్య, నిర్మాత కలిసి కేరళలోని స్థానిక న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగా తమకు న్యాయం చేయాలని, తమ డబ్బులు ఇప్పించాలని కోరుతూ పోలీసుల ద్వారా న్యాయపోరాటానికి దిగారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం నటుడు ఆర్యతో పాటు చిత్ర నిర్మాత వినోద్, పీఏ కిశోర్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మోసం కేసుపై దర్యాప్తును వేగవంతం చేశామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story