Chennai Love Story Review: అన్న మరో హిట్ కొట్టిండు..!

Chennai Love Story Review: కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ.

Naresh.k
Published on: 24 July 2026 8:52 AM IST
Chennai Love Story Review
X

Chennai Love Story Review: అన్న మరో హిట్ కొట్టిండు..!

Chennai Love Story Review: 'బేబీ' లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సాయి రాజేష్ - ఎస్ కే ఎన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే ఆడియెన్స్‌లో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, మణిశర్మ అందించిన మెలోడీస్ ఆ హైప్‌ను మరింత పెంచేశాయి. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన ఈ 'చెన్నై లవ్ స్టోరీ' ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే?

రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమను కాదని కాబోయే భర్త అజయ్ (త్రిగుణ్) పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోవడంతో నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) తీవ్ర మానసిక వేదనకు గురవుతుంది. ఆ బాధను తట్టుకోలేక మందుకు బానిసగా మారుతుంది. చెన్నైలో రూమ్‌మేట్స్‌తో ఉంటున్న నివి జీవితంలోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ప్రవేశిస్తాడు. ఎలాగైనా మంచి దర్శకుడిగా మారాలని కలలు కనే అనాథ అయిన స్టీవెన్‌తో నివికి మెల్లిగా స్నేహం కుదురుతుంది. స్టీవెన్ అమాయకత్వం, స్వచ్ఛమైన మనసు చూసి నివి మళ్లీ ప్రేమలో పడుతుంది. కానీ, వీరిద్దరూ ఒక్కటయ్యే సమయానికి కథలో ఓ పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? స్టీవెన్ కల నెరవేరిందా? ఈ కథలోకి అజయ్ మళ్లీ ఎలా వచ్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

ఏ ప్రేమకథకైనా సంఘర్షణ అనేది ప్రధాన బలం. కథ ప్రారంభంలోనే హీరోయిన్ లవ్ ఫెయిల్యూర్‌ను చూపించడం, ఆ తర్వాత అమాయకుడైన హీరో రాక, వారి మధ్య చిగురించే అనుబంధం... ఇలా ప్రథమార్థం చాలా ఆసక్తికరంగా, హాయిగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ 5 నిమిషాల సైలెంట్ సీన్ ప్రేక్షకుడి గుండెను మెలిపెడుతుంది. సమీప కాలంలో ఇంత హార్డ్ హిట్టింగ్ ఇంటర్వెల్ సీన్ రాలేదనడంలో సందేహం లేదు. ద్వితీయార్థంలో సినిమా కాస్త సాగదీసినట్లు అనిపించినా, కథలోని ఎమోషన్స్ దాన్ని నిలబెడతాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ దృశ్యాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయి. ఈ సినిమాలో ఎక్కువ లాజిక్స్ వెతక్కుండా చూస్తే, ఒక మంచి ప్రేమకావ్యపు మ్యాజిక్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు.

నటీనటుల ప్రతిభ

సినిమాకు అసలైన హీరో గౌరీ ప్రియ. నివి పాత్రలో జీవించేసింది.ఎమోషనల్ సీన్లలో కిరణ్ అబ్బవరం తన నటనతో పరిణతి చూపించి, ఏడిపించేశాడు. ఇతర నటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక విభాగం

చాలా రోజుల తర్వాత మణిశర్మ తన పాత మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. పాటలతో పాటు మనసుని మీటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి.

ఫైనల్‌గా

‘చెన్నై లవ్ స్టోరీ’ మహాద్భుతం అని చెప్పలేకపోయినా... ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు. చాలా రోజుల తర్వాత ఒక స్వచ్ఛమైన, గుండెను తాకే మంచి ప్రేమకథను చూశామనే ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story