Chiranjeevi : మరోసారి మానవత్వం చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi : తెలుగు చిత్రసీమలో తోటి నటీనటులు, సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారంటే మొదటి వ్యక్తిగా స్పందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను,

G Krishna
Published on: 26 July 2026 11:45 AM IST
Chiranjeevi
X

Chiranjeevi

Chiranjeevi : తెలుగు చిత్రసీమలో తోటి నటీనటులు, సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారంటే మొదటి వ్యక్తిగా స్పందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సినిమా 'గబ్బర్ సింగ్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్న రమేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు చిరంజీవి తక్షణమే ముందుకొచ్చారు.

డాక్టర్లతో నిరంతరం సంప్రదింపులు.. మెరుగైన వైద్యంపై స్పెషల్ కేర్

రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్త తెలియగానే చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుడికి అత్యుత్తమ వైద్యం అందేలా స్వయంగా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డితో చిరు నిరంతరం టచ్‌లో ఉంటూ రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు. చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా, అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

రమేష్ సతీమణికి రూ.3 లక్షల చెక్కు అందజేత

ఆసుపత్రిలో అత్యవసర చికిత్స , శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చుల వల్ల రమేష్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చిరంజీవి వారికి అండగా నిలిచారు. స్వయంగా రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరు, ధైర్యం చెప్పారు. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం రమేష్ సతీమణికి రూ. 3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. భవిష్యత్తులోనూ చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకం వర్తించేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

సినీ వర్గాలు, అభిమానుల ప్రశంసల వర్షం

గతంలో కూడా ఎంతోమంది పేద కళాకారులకు, సినీ కార్మికులకు చిరంజీవి హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సపోర్ట్ అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ గబ్బర్ సింగ్ రమేష్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో త్వరితగతిన స్పందించి ఆర్థికంగా, మానసికంగా కొండంత అండగా నిలవడంపై ఇండస్ట్రీ ప్రముఖులు, మెగా అభిమానులు చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రమేష్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story