Chiranjeevi: సూర్య నాకు స్ఫూర్తి అంటూ.. ఉగాది సందర్భంగా చిరంజీవి సంచలన నిర్ణయం!
Chiranjeevi: 2026 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పేద అవసరమైన వారికి ఉచిత విద్య అందించాలనే సంకల్పాన్ని ప్రకటించారు.
Chiranjeevi: సూర్య నాకు స్ఫూర్తి అంటూ.. ఉగాది సందర్భంగా చిరంజీవి సంచలన నిర్ణయం!
Chiranjeevi: 'మెగాస్టార్' చిరంజీవి తన సేవా కార్యక్రమాలతో దేశంలో ఇప్పటికే ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా లక్షలాది మందికి మెగాస్టార్ సేవలు అందిస్తున్నారు. రక్తదానం, నేత్రదానం కార్యక్రమాల ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడిన ఆయన.. ఇప్పుడు మరో గొప్ప లక్ష్యంతో ముందుకు వస్తున్నారు.
2026 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించినట్లే, ఇకపై పేద మరియు అవసరమైన వారికి ఉచిత విద్య అందించాలనే సంకల్పాన్ని ప్రకటించారు. సమాజంలో విద్యా అవకాశాలు లేని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరు తెలిపారు. తమిళ స్టార్ హీరో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ నుంచి ప్రేరణ పొందినట్లు చిరంజీవి వెల్లడించారు. ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ అంటూ ఇచ్చిన హింట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
'నేను బ్లడ్ బ్యాంక్ ప్రారంభించిన సమయంలో తమిళ హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. అగరం ఫౌండేషన్ ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా వందలాది మంది పేద విద్యార్థులను సూర్య చదివిస్తున్నారు. ఆయన ఎంతో మంది విద్యార్థుల జీవితాలను మార్చిన విధానం నన్ను ఆకట్టుకుంది. ఇప్పుడు నేను సూర్యను స్ఫూర్తిగా తీసుకుంటున్నా. పేద ప్రజలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనుకుంటున్నా. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను' అని చిరంజీవి చెప్పారు. ఈ విద్యా ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని మెగాస్టార్ తెలిపారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలతో చిరంజీవి మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. చిరు నిర్ణయంపై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. 2026 సంక్రాంతికి విడుదలైన' మనశంకర వరప్రసాద్ గారు' సూపర్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మెగా అభిమానులను బాగా మెప్పించింది. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర, బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో వస్తున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.




