Chiranjeevi Missed Kondaveeti Simham: ఎన్టీఆర్‌తో చిరంజీవి వదిలేసుకున్న సినిమా... మోహన్‌బాబుకు అదృష్టంగా మారింది

Chiranjeevi Missed Kondaveeti Simham:నందమూరి తారక రామారావు నట ప్రస్థానంలో 'కొండవీటి సింహం' ఒక మైలురాయి.

Balachander
Published on: 17 April 2026 10:45 AM IST
Chiranjeevi Missed Kondaveeti Simham
X

Chiranjeevi Missed Kondaveeti Simham

Chiranjeevi Missed Kondaveeti Simham: నందమూరి తారక రామారావు నట ప్రస్థానంలో 'కొండవీటి సింహం' ఒక మైలురాయి. కేవలం 53 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని, దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ డ్రామా దాగి ఉంది. మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన పాత్ర, అనుకోని కారణాల వల్ల కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెంతకు చేరి ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.

అనుకోని మలుపు

1981లో విడుదలైన 'కొండవీటి సింహం' బాక్సాఫీస్ వద్ద ఒక సునామీలా విరుచుకుపడింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా, ఆయనకు కొడుకుగా నటించే 'నెగటివ్ షేడ్స్' ఉన్న పాత్ర కోసం చిత్ర యూనిట్ తొలుత చిరంజీవిని సంప్రదించింది. కానీ, అప్పటికే చిరంజీవి ఎదుగుతున్న నటుడు. పైగా ఆయన చట్టానికి కళ్లు లేవు అనే సినిమాకు కమిట్‌ అయ్యాడు. డేట్స్‌ సమస్య తలెత్తింది. ఈ సమస్యకు కొండవీటి సింహం నిర్మాతలే పరిష్కారం చూపారు. చిరంజీవి కమిటయ్యి ఉండటంతో ఆ సినిమానే చేయమని సలహా ఇచ్చారు. ఆ విధంగా ఈ సినిమా నుంచి చిరంజీవి పక్కకు తప్పుకోవలసి వచ్చింది. అయితే, అప్పటికే ఇండస్ట్రీలో మోహన్‌బాబు విలన్‌ రోల్స్‌ చేస్తున్నాడు. నెగెటీవ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోతుండటంతో ఆయనకు కొండవీటి సింహం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దాసరి వద్ద ఉన్న డేట్స్‌ను ఈ సినిమాకు అడ్జెస్ట్‌ చేయడంతో సినిమా పూర్తయింది. ఈ సినిమా తరువాత మోహన్‌బాబు కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పొచ్చు.

రికార్డుల వెల్లువ

దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తమిళ హిట్ ‘తంగ పథకం’ ఆధారంగా రూపుదిద్దుకుంది. రచయిత సత్యానంద్ కథను ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు మార్చడం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరో మరణం చూపించడం ఆ కాలంలో సాహసోపేత నిర్ణయం. కానీ, దీనిని ప్రేక్షకులు జీర్ణం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఇక సినిమా 65 కేంద్రాల్లో విడుదలై 31 కేంద్రాల్లో 100 రోజులు, 14 కేంద్రాల్లో 175 రోజులు ఆడి భారీ విజయాన్ని సాధించింది. నైజాం, రాయలసీమ ప్రాంతాల్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం దాదాపు 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

మొత్తంగా చూసుకుంటే చిరంజీవి వదిలేసుకున్న ఒక అవకాశం మోహన్‌బాబుకు పెద్ద బ్రేక్‌గా మారింది. ఇదే సినిమా తెలుగు చిత్రసీమలో నటీనటుల కెరీర్‌లను ఎలా మలుపు తిప్పుతుందో చూపించిన ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story