ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు: చిరంజీవి

Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్).

Srinivas Rao
Published on: 28 May 2026 1:17 PM IST
Chiranjeevi
X

ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు: చిరంజీవి

Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్). నేడు (మే 28) ఆయన 103వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆ యుగపురుషుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ షేర్ చేసిన ఒక అరుదైన ఫోటో, పెట్టిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ తారక రాముని ప్రభావం ఎప్పటికీ చెరిగిపోదు

చిరంజీవి తన అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతాలో ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఒక అరుదైన వింటేజ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పంచుకుంటూ హృదయపూర్వక నివాళి అర్పించారు.

https://twitter.com/KChiruTweets/status/2059835628209176648

మెగాస్టార్ ట్వీట్ యథాతథంగా:

“ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా.. ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు.

ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..” అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ‘గద్దర్ సినీ అవార్డ్స్’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని’ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న చిరంజీవి.. ఎన్టీఆర్ పేరిట ఉన్న అవార్డును అందుకోవడం తన జీవితంలోనే అత్యంత విలువైన గౌరవంగా భావిస్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన వింటేజ్ పిక్ చూసి మెగా అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా లైకులు, కామెంట్లు కొడుతున్నారు. తెలుగు సినిమాకు రెండు కళ్లుగా నిలిచిన ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ అరుదైన ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.


Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story