Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై మెగాస్టార్‌ అప్‌డేట్‌!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Srinivas Rao
Published on: 19 April 2026 4:45 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై మెగాస్టార్‌ అప్‌డేట్‌!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. పవన్‌ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స

గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత (సైనసైటిస్) సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌కు, శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. "కల్యాణ్‌ బాబుకు ఆపరేషన్‌ విజయవంతమైంది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉంది. సాధారణ స్థితికి రావడానికి వారం రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. పవన్‌ క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.

తీవ్ర అస్వస్థతకు గురైన ఉప ముఖ్యమంత్రి

శుక్రవారం ఉదయం సచివాలయంలో అధికారులతో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా పవన్‌ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకుని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఎంఆర్‌ఐ , ఇతర పరీక్షలు నిర్వహించిన అనంతరం చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి, శనివారం సాయంత్రం దానిని పూర్తి చేశారు. పది రోజుల పాటు పవన్‌ సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు గట్టిగా సూచించారు.

పరామర్శించిన ప్రధాని మోదీ, సినీ ప్రముఖులు

పవన్‌ కల్యాణ్‌ అస్వస్థత వార్త తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. నేరుగా ఫోన్‌ చేసి పవన్‌ యోగక్షేమాలను ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టారు. మరోవైపు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ వంటి అగ్ర నటులు కూడా పవన్‌ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఆకాంక్షించారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story