Harassment: హద్దుమీరిన స్టార్ హీరో..సెట్‌లో హీరోయిన్‌కు బలవంతంగా ముద్దులు..!

Harassment: గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటపెట్టారు ప్రముఖ నటి ప్రియా బాపట్.

Naresh.k
Published on: 12 Jun 2026 9:24 AM IST
Harassment
X

Harassment: హద్దుమీరిన స్టార్ హీరో..సెట్‌లో హీరోయిన్‌కు బలవంతంగా ముద్దులు..!

Priya Bapat : గ్లామర్ ప్రపంచంగా కనిపించే సినిమా ఇండస్ట్రీ వెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో కొత్తగా వచ్చే నటీమణులకు ఎదురయ్యే వేధింపులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి ప్రియా బాపట్, షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన ఒక అత్యంత దారుణమైన, చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఒక స్టార్ నటుడు స్క్రిప్ట్‌లో లేకపోయినా తనతో ఎలా అసభ్యంగా ప్రవర్తించాడో చెప్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.

ప్రియా బాపట్ ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని అత్యంత అసౌకర్యవంతమైన ఘట్టాన్ని పంచుకున్నారు. ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు రాకముందు భోపాల్‌లో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిజానికి ఆ చిత్ర స్క్రిప్ట్ రీడింగ్ దశ నుంచే అందులోని ఒక కిస్ సీన్‌పై ప్రియకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కథా పరంగా ఆ సన్నివేశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటని ఆమె దర్శకుడిని కూడా ప్రశ్నించారు. కానీ, కథకు అవసరమైతే నటించాలనే ఉద్దేశంతో చివరికి ఆ సీన్ చేయడానికి అంగీకరించారు. కానీ షూటింగ్ స్పాట్‌లో జరిగిన పరిణామాలు ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి.

ఒక పాట చిత్రీకరణ సమయంలో సదరు సహనటుడు కథ పరిధిని, హద్దులను పూర్తిగా దాటి ప్రవర్తించాడు. ప్రియ ప్రమేయం లేకుండానే, ఆమె ఇష్టపడకపోయినా పదే పదే ముద్దు పెట్టుకుంటూ తీవ్ర ఇబ్బందికి గురిచేశాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఆ పరిణామానికి ప్రియ షాక్‌కు గురయ్యారు. ఆ అసౌకర్యకర పరిస్థితిని ఎలా ఎదిరించాలో కూడా అర్థం కాక నిస్సహాయంగా ఉండిపోయారు. అంతటితో ఆగకుండా, షూటింగ్ వెలుపల కూడా ఆ నటుడి నుండి వేధింపులు ఎదురయ్యాయి. భోపాల్‌లోని ఒకే హోటల్లో వేర్వేరు గదుల్లో బస చేసిన సమయంలో.. ప్రియ ఎంత వ్యతిరేకించినా వినకుండా, కలిసి బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ చేద్దామంటూ సదరు నటుడు పదే పదే ఫోన్ చేస్తూ ఒత్తిడి తెచ్చాడు. ఈ వరుస పరిణామాలతో ప్రియా బాపట్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ప్రతిరోజూ రాత్రి షూటింగ్ ముగిసిన తర్వాత ముంబైలో ఉన్న తన భర్త ఉమేష్‌కు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకునేవారు. భార్య పడుతున్న నరకాన్ని గమనించిన ఉమేష్ తక్షణమే స్పందించారు.

ఆయన వెంటనే ముంబై నుండి భోపాల్‌కు ఫ్లైట్‌లో చేరుకున్నారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆయన సెట్లోనే ప్రియతో పాటు ఉండి రక్షణగా నిలిచారు. ఆ తర్వాతే ఆమె ప్రశాంతంగా షూటింగ్‌ను పూర్తి చేయగలిగారు. తన కెరీర్లో అలాంటి ఘోరమైన అనుభవం ఎదురవ్వడం అదే మొదటి, చివరిసారి అని ప్రియ స్పష్టం చేశారు. మరాఠీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ప్రియా బాపట్.. 'కాక్ స్పర్మ్', 'హాపీ జర్నీ' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే సోని లివ్‌లో ప్రసారమైన 'సిటీ ఆఫ్ డ్రీమ్స్', 'రాత్ జవాన్ హై' వంటి వెబ్ సిరీస్ల ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎంతో ధైర్యంగా తనపై జరిగిన వేధింపులను బయటపెట్టిన ప్రియా బాపట్‌కు ఇప్పుడు నెటిజన్లు, మహిళా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story