ముదిరిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. నేడు మధ్యాహ్నం 3 గంటలకు కీలక ప్రెస్ మీట్!
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆర్థిక అక్రమాలు, నిర్మాతల దోపిడీ ఆరోపణలపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్షురాలు సుమలతా దేవి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Tollywood Dancers Association: తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో రేగిన వివాదం టాలీవుడ్‌లో మరింత ముదురుతోంది. జానీ మాస్టర్ దంపతుల ఏకపక్ష నిర్ణయాలు, ఆర్థిక అక్రమాలను నిరసిస్తూ 10 మంది కమిటీ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమపై వస్తున్న తీవ్ర ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అసోసియేషన్ అధికారికంగా సిద్ధమైంది. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు అసోసియేషన్ కార్యాలయంలో అత్యవసర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలతా దేవి ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొని మీడియాతో మాట్లాడనున్నారు. ఆమెతో పాటు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యులు, పలువురు ప్రముఖ కొరియోగ్రాఫర్లు, మరియు డ్యాన్సర్లు ఈ సమావేశంలో పాల్గొని తమ వాదనను వినిపించనున్నారు.
గత కొద్దిరోజులుగా అసోసియేషన్ పేరుతో కొందరు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని, నిర్మాతలను తీవ్రంగా తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు పరిశ్రమలో గుప్పుమన్నాయి. డ్యాన్సర్ల అవసరం నెపంతో నిర్మాతల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. నిర్మాతలను దోచేస్తూ, మరోవైపు సాధారణ డ్యాన్సర్లకు అందాల్సిన అసలు పారితోషికాన్ని (రెమ్యునరేషన్) సరిగ్గా చెల్లించడం లేదనే ఆరోపణలపై ఈ సమావేశంలో అసోసియేషన్ తన అధికారిక వైఖరిని వెల్లడించనుంది.
తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు, అసోసియేషన్‌లో అసలు ఏం జరుగుతుందనే దానిపై సుమలతా దేవి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ వివాదానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా మీడియా ముందు ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.




