Tollywood: చిరంజీవిని కాదని బాలకృష్ణతో డైరెక్టర్ కోడి రామకృష్ణ సినిమాలు చేసింది అందుకే.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Tollywood: దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ తన కెరీర్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Ravi
By Ravi
Published on: 29 July 2026 9:22 PM IST
Tollywood
X

Tollywood: చిరంజీవిని కాదని బాలకృష్ణతో డైరెక్టర్ కోడి రామకృష్ణ సినిమాలు చేసింది అందుకే.. ఆసక్తికర వ్యాఖ్యలు.. 

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి హిట్లు అందించి, ఆ తర్వాత నటుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న దేవి ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తన డైరెక్షన్ కెరీర్ గురించి, కొన్ని సినిమాలు ఎందుకు ఆగిపోయాయో వివరించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా దాదాపు ఖరారైన తర్వాత ఎందుకు ఆగిపోయిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఆ సినిమా కోసం వేరే వాళ్ళ కథ విని, అడ్వాన్స్ కూడా తీసుకున్న తర్వాత, తన 'మిస్టర్ పెళ్లికొడుకు' సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారని దేవి ప్రసాద్ తెలిపారు. తర్వాత బాలకృష్ణతో 'ఎన్టీఆర్ బయోపిక్'లో కలిసి నటించినప్పటికీ, ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందని తాను ఎప్పుడూ ఆయన్ని అడగలేదని ఆయన స్పష్టం చేశారు. తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా ఎవరితోనూ చెప్పకుండా తానే స్వయంగా తిరిగి ఇచ్చేశానని, ఎవరి దగ్గరా ఒక రూపాయి ఉంచుకున్నా తనకు మనశ్శాంతి ఉండదని దేవి ప్రసాద్ వెల్లడించారు.

ఇక తన గురువు, ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గురించి కూడా దేవి ప్రసాద్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణకి పరిశ్రమలో దక్కాల్సినంత గుర్తింపు రాలేదేమో అని దేవి ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆయన ఎంతో గొప్ప ప్రతిభావంతుడని, అయినా ఎప్పుడూ చాలా సాధారణంగా ఉండేవారని ప్రశంసించారు. ఇక చిరంజీవికి, కోడి రామకృష్ణకి మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. వరుసగా ఐదు హిట్ సినిమాలు ఇచ్చిన ఇద్దరూ.. కథ, పాత్రలు సరిగ్గా కుదరకపోవడం వల్లే మళ్ళీ కలిసి పని చేయలేకపోయి ఉండొచ్చునని చెప్పుకొచ్చారు. ఒకసారి శివాజీ గార్డెన్స్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి అక్కడికి రాగా, కోడి రామకృష్ణ ఆయన కళ్ళు మూసి సరదాగా ఆటపట్టించారని, వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా మాట్లాడుకోవడం తాను స్వయంగా చూశానని దేవి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.

అదేవిధంగా దాసరి నారాయణ రావుకి, కోడి రామకృష్ణకి పడదు అనే పుకార్లను కూడా ఆయన ఖండించారు. భారత్ బంద్ సినిమా సమయంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వచ్చాయని, అయితే ఒకసారి దాసరి స్వయంగా షూటింగ్ స్పాట్‌కు వచ్చి కోడి రామకృష్ణతో సరదాగా మాట్లాడారని దేవి ప్రసాద్ తెలిపారు. వారిద్దరి మధ్య ఎంతో గౌరవం, ఆప్యాయత ఉండేవని, ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సహజమేనని ఆయన స్పష్టం చేశారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story