Dhanush: నా సినిమాపై పడి ఏడుస్తున్నారు..అప్పుడు ఏం చేశారు
Dhanush: 'రాయన్' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై వస్తున్న విమర్శలపై నటుడు ధనుష్ ఘాటుగా స్పందించారు.
Dhanush: నా సినిమాపై పడి ఏడుస్తున్నారు..అప్పుడు ఏం చేశారు
National Award: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, విలక్షణ దర్శకుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'రాయన్' ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 'ఉత్తమ తమిళ చిత్రం'గా నిలిచింది. అయితే ఈ పురస్కారంపై కోలీవుడ్ సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ పెద్ద ఎత్తున చర్చలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఏడాది విడుదలైన 'మహారాజా', 'మేయళగన్' వంటి ప్రశంసలు పొందిన చిత్రాలను కాదని 'రాయన్'కు అవార్డు ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్, జాతీయ అవార్డుల వివాదంపై స్పందిస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
తమ చిత్రంపై వస్తున్న విమర్శలకు ధనుష్ ఎంతో హుందాగా, అంతే నిజాయితీగా సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ... ప్రేక్షకులు, విమర్శకులు చెబుతున్నట్లుగా 'మేయళగన్', 'మహారాజా' చిత్రాలు ఖచ్చితంగా 'రాయన్' కంటే ఎంతో మెరుగైన సినిమాలు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నా కెరీర్‌లో అత్యుత్తమ మైలురాళ్లుగా నిలిచిన 'పుదుపెట్టై', 'వడ చెన్నై', 'కర్ణన్', 'మారియన్', 'రాంఝనా' వంటి చిత్రాలకు జాతీయ అవార్డులు రానప్పుడు కనీసం 10 శాతం మంది కూడా దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు 'రాయన్'కు అవార్డు రాగానే 90 శాతం మంది వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తాను నటించిన గొప్ప చిత్రాలకు తగిన గుర్తింపు రానప్పుడు స్పందించని వారు, ఇప్పుడు తనకు అవార్డు రాగానే ఇంతలా విమర్శించడంపై ధనుష్ వ్యక్తం చేసిన ఘాటైన అసంతృప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధనుష్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమేనని ఆయన అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. 'వడ చెన్నై', 'మారియన్', 'కర్ణన్' వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంతగానో అర్హమైనవని, ఆ సమయంలో రాని గుర్తింపుపై ధనుష్ క్లారిటీ ఇవ్వడం సముచితంగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత కోలీవుడ్‌లో రాజుకున్న ఈ వివాదానికి ధనుష్ ఓపెన్ కామెంట్స్ మరింత ఆజ్యం పోశాయి.




