Diljit Dosanjh: హిందుస్థాన్ ఎవరి సొత్తు కాదు.. ఇందౌర్ వేదికపై దిల్జిత్ సంచలన వ్యాఖ్యలు!

Diljit Dosanjh: ఇందౌర్ కచేరీలో ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Arun Chilukuri
Published on: 16 Nov 2026 10:58 AM IST
Diljit Dosanjh
X

Diljit Dosanjh: హిందుస్థాన్ ఎవరి సొత్తు కాదు.. ఇందౌర్ వేదికపై దిల్జిత్ సంచలన వ్యాఖ్యలు!

Diljit Dosanjh: ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్‌ దోసాంజ్‌ తన వ్యాఖ్యలతో మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగిన తన లైవ్ కచేరీ సందర్భంగా దిల్జిత్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన ప్రదర్శనను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ అభిమానుల ప్రేమే తనను ఇక్కడికి తీసుకొచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

నవంబర్‌ 15న ఇందౌర్‌లో జరిగిన భారీ మ్యూజిక్ కచేరీని దిల్జిత్‌ ‘జై శ్రీ మహాకాళ్‌’ నినాదంతో ఉత్సాహంగా ప్రారంభించారు. అనంతరం తన షోకు ఎదురైన అడ్డంకుల గురించి అభిమానులను ఉద్దేశించి భావోద్వేగంగా, ఘాటుగా మాట్లాడారు.

‘‘చూడండి.. ఇది మహాకాళుడి నేల. ఇక్కడికి రావడాన్ని ఎవరూ ఆపలేరు. గతంలోనూ నేను దేనికీ భయపడలేదు.. ఇప్పుడు కూడా భయపడటం లేదు. మీ అభిమానమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నన్ను ఇందౌర్‌కు రాకుండా అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఒకసారి వస్తానని ఎవరికైనా మాటిస్తే.. ఆ మాట తప్పను. ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ మీ ముందు నిలబడ్డాను. ఈ దేశ మట్టిలో అందరి రక్తం కలిసే ఉంది.. హిందుస్థాన్‌ ఎవరి సొత్తు కాదు’’ అని దిల్జిత్‌ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి దిల్జిత్‌ ఇందౌర్‌ కచేరీకి ముందే పెద్ద ఎత్తున వివాదాలు మొదలయ్యాయి. ఆయన పాడే కొన్ని పాటల్లో మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలను ప్రోత్సహించేలా సాహిత్యం ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పాటలు చిన్నారులు, యువతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన అధికారులు.. కచేరీలో ఆ నాలుగు పాటలను పాడకూడదని ఆంక్షలు విధించారు.

మరోవైపు, ఈ కచేరీ జరగడానికి కొద్దిసేపటి ముందు ఇందౌర్‌లోని మూడు ప్రైవేటు పాఠశాలలు, నగర మేయర్‌ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించి, అవి నకిలీ బెదిరింపులుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ పరిణామాలన్నింటి మధ్య దిల్జిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.