SATLUJ: థియేటర్లలో బ్యాన్ చేశారు.. OTTలో రిలీజ్ చేస్తే రెండు రోజులకే మూసేశారు!
SATLUJ: బాలీవుడ్ స్టార్ దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లుజ్' చిత్రం ZEE5 ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే అకస్మాత్తుగా అదృశ్యమైంది.
SATLUJ: థియేటర్లలో బ్యాన్ చేశారు.. OTTలో రిలీజ్ చేస్తే రెండు రోజులకే మూసేశారు!
Diljit Dosanjh: బాక్సాఫీస్ వద్ద ఎన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినా.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా, సమాజంలో దాచిన నిజాలను చూపించే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అలాంటి ఒక సంచలనాత్మక చిత్రమే బాలీవుడ్ స్టార్ నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లుజ్' . సెన్సార్ అడ్డంకులను దాటుకుని, నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన రెండు రోజులకే అకస్మాత్తుగా అదృశ్యం కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ సినిమా 1990ల నాటి పంజాబ్ ఉగ్రవాదం కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కింది. ఆ సమయంలో పంజాబ్‌లో దాదాపు 25,000 మంది అదృశ్యాలు, వివాదాస్పద ఎన్‌కౌంటర్ల వెనుక ఉన్న చేదు నిజాలను ఒంటరి పోరాటంతో వెలికితీసిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2022లోనే ఈ సినిమా నిర్మాణం పూర్తయింది.
కథాంశం అత్యంత సున్నితమైనది కావడంతో, థియేట్రికల్ రిలీజ్ కోసం ఈ సినిమాను పరిశీలించిన సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ విధించింది. సినిమా ఆత్మను దెబ్బతీసే ఇన్ని కట్స్‌తో థియేటర్లలో విడుదల చేయడం ఇష్టం లేక చిత్ర బృందం వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు నాలుగేళ్ల పోరాటం తర్వాత.. ఎలాంటి కట్స్ లేకుండా పూర్తి నిడివితో 2026, జూలై 3న ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా నేరుగా విడుదలైంది.
జూలై 3న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు ఓటీటీ ప్రియుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఊహించని విధంగా జూలై 5న (ఆదివారం) భారతదేశంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. చాలా మంది వీక్షకులు సినిమా చూస్తున్న మధ్యలోనే ఒక్కసారిగా స్క్రీన్ ఆగిపోవడంతో షాక్‌కు గురయ్యారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జీ5 (ZEE5) యాజమాన్యాన్ని నిలదీయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలో అందుబాటులో లేనప్పటికీ, ఇతర దేశాల్లో మాత్రం ఇంకా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.
ఈ సంచలన పరిణామంపై ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5 స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా 'సట్లుజ్' సినిమా స్ట్రీమింగ్‌ను భారతదేశంలో తాత్కాలికంగా నిలిపివేశాము. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించి, తిరిగి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తాం అని అధికారికంగా ప్రకటించింది. నిజాలను నిర్భయంగా చూపించే ప్రయత్నం చేసిన 'సట్లుజ్' చిత్రానికి డిజిటల్ వేదికపై కూడా ఇలాంటి అడ్డంకులు ఎదురుకావడంపై సినిమా విశ్లేషకులు, భావప్రకటన స్వేచ్ఛను కోరుకునే వారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం మళ్లీ ఇండియన్ ఓటీటీ స్క్రీన్స్‌పై ఎప్పుడు సందడి చేస్తుందో చూడాలి.




