Jana Nayagan: అసలు నిజాలు చెప్పే ధైర్యం నాకు లేదు.. జన నాయగన్‌ దర్శకుడు

Jana Nayagan: ‘జన నాయగన్‌’ విడుదల నిరంతరం వాయిదా పడుతూ వస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Srinivas Rao
Published on: 31 May 2026 1:06 PM IST
Jana Nayagan
X

Jana Nayagan: అసలు నిజాలు చెప్పే ధైర్యం నాకు లేదు.. జన నాయగన్‌ దర్శకుడు

Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) నటించిన మోస్ట్ ఎవైటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్‌’ విడుదల నిరంతరం వాయిదా పడుతూ వస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో, తాజాగా జరిగిన ఒక చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమా విడుదల వివాదం , ఆలస్యంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

సెన్సార్ వివాదంపై దర్శకుడి బోల్డ్ స్టేట్‌మెంట్

సదరు కార్యక్రమంలో ‘జన నాయగన్‌’ ఎప్పుడు విడుదలవుతుంది? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు హెచ్.వినోద్ అత్యంత వ్యంగ్యంగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. "సినిమా విడుదల అనేది ఎప్పుడూ ఒక దర్శకుడి చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించి తెరవెనుక జరిగిన అసలు నిజాల గురించి మాట్లాడేంత ధైర్యం ప్రస్తుతానికి నాకు లేదు. ఒకవేళ నేను నిజాలు చెప్పే ధైర్యం చేసినా.. దానిని మీ ఛానల్‌లో ప్రసారం చేసే అంత ధైర్యం మీకు లేదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యల ద్వారా సినిమా విడుదలను అడ్డుకోవడానికి కొన్ని బలమైన రాజకీయ లేదా అంతర్గత శక్తులు ప్రయత్నిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంక్రాంతి రేస్ నుండి కోర్టు మెట్లు ఎక్కే వరకు..

నిజానికి విజయ్ కెరీర్‌లో ఇదే ఆఖరి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే, సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం కాస్త కోర్టుల వరకు వెళ్లింది. సినిమాలోని కొన్ని రాజకీయ సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక రివైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సినిమాను చూసి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదని, సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఇంకా వేచి చూస్తున్నామని నిర్మాత వెంకట్ కె. నారాయణ (కేవీఎన్ ప్రొడక్షన్స్) ఇటీవల మీడియాకు స్పష్టం చేశారు.

సీఎం అయినా దక్కని ఊరట.. జూన్ విడుదలైతేనే!

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ‘జన నాయగన్‌’ విడుదలకు ఉన్న ఆటంకాలన్నీ త్వరగా తొలగిపోతాయని అభిమానులు ఆశించారు. కానీ, చట్టపరమైన , సెన్సార్ బోర్డు నిబంధనల కారణంగా ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతం కొన్ని ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు చూపిస్తుండటంతో, విజయ్ పుట్టినరోజు (జూన్ 22) కానుకగా ఈ చిత్రం థియెటర్లలోకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story