Drishyam: నటన ఎలా ఉండాలో...ఈ ఒక్కసీన్‌ చూస్తే చాలు...

నటిస్తున్నామనే భావన కలిగించకుండా..ప్రేక్షకుడిని కథలో లీనం చేయడమే నటుడి గొప్పదనం. దానికో ఉదాహరణే ఈ సీన్‌. ఐదారు భాషల్లో రీమేక్‌ చేసినా...సినిమా హిట్‌ కావడానికి కారణం ఇదే.

Balachander
Published on: 17 Jun 2026 2:33 PM IST
Drishyam: నటన ఎలా ఉండాలో...ఈ ఒక్కసీన్‌ చూస్తే చాలు...
X

Drishyam: కెమెరా ముందుకు వెళ్లనంత వరకు ఒకలా కనిపించే నటులు...కెమెరా ముందుకు వెళ్లి యాక్షన్‌ అనగానే...చేస్తున్న పాత్రలో...వస్తున్న సీన్‌లో పూర్తిగా నిమగ్నమౌతారు. హీరోలు, నటులు కనిపిస్తే చేస్తున్న పాత్ర ఫెయిల్‌ అయినట్టే..నటుడిగా ఏమాత్రం పనికిరారని తేలిపోతుంది. ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు ఓ సందర్భంగా చుక్కల్లో చంద్రుడు సినిమాలో సిద్ధార్థతో చెప్పారట. నటిస్తున్నామనే భావన ప్రేక్షకుడికి కలగకూడదు. సాధారణ ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేయగలిగితే నటుడిగా వందశాతం విజయం సాధించినట్టేనని చెప్పారట. నటన ఎలా ఉండాలో తెలియాలంటే దృశ్యం సినిమాలోని ఒక్క క్లైమాక్స్‌ సీన్‌ చాలని అంటున్నారు సినీ పండితులు.

దృశ్యం క్లైమాక్స్‌... మోహన్‌లాల్‌ నుంచి రవిచంద్రన్‌ వరకు

సినీ ప్రేక్షకులపై భారీగా ప్రభావం చూపిన సినిమా దృశ్యం. ఒక సాధారణ కుటుంబంలో కొంతమంది వలన ఇబ్బందులు ఎదురైతే... తన వారిని కాపాడుకోవడానికి ఆ తండ్రి ఏం చేశాడు అన్నదే సినిమా. కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, బలమైన కథనాలు, అంతకు మించిన నటన ఈ క్రైమ్‌ సినిమాను అన్ని భాషల్లో రీమేక్‌ అయ్యేలా చేసింది. మొదట ఈ సినిమాను మళయాలంలో తీశారు. మళయాలంలో మోహన్‌లాల్‌ నటించాడు. నటించాడు అని చెప్పడం కంటే జీవించాడనే చెప్పాలి. క్లైమాక్స్‌ సీన్‌లో మోహన్‌లాల్‌ ముఖంలో పెద్దగా పశ్చాత్తాపం కనిపించదు. నా కుటుంబాన్ని రక్షించడానికి ఎంతకన్నా తెగిస్తాను. దయచేసి నన్ను ఊరికనే మీ కొడుకు శవం గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి అని చేతులు ఎత్తి దణ్ణం పెడతాడు. ఆయన ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ పెద్దగా కనిపించవు. పశ్చాత్తాపం ఉండదు. ఇదే సీన్‌ని తెలుగులో వెంకటేష్‌ చేసినపుడు ఎలా మారిందో చూడండి.

వెంకటేష్‌కి కళ్లల్లో పశ్చాత్తాపం కనిపించదు. ఎంతవరకైనా వెళ్తానని చెప్పడు. కానీ, అంతకంటే... తన ముందున్న వారిని బాధించాననే బాధ అతని ముఖంలో కనిపిస్తుంది. ఇదే క్లైమాక్స్‌లో కమల్‌ హాసన్‌ నటన మరో లెవల్‌కి తీసుకెళ్లింది. తన కళ్లల్లో, మొహంలోనూ పశ్చాత్తాపంతో పాటుగా, అనుకోని పరిస్థితుల్లో ఒక మనిషిని పాతిపెట్టాల్సి వచ్చింది అనుకుంటూ... ఆ తల్లిదండ్రుల ముఖం చూడలేక తనలో తనే పడే నరకయాతనను అద్భుతంగా చూపిస్తాడు. ఇకే సమయంలో పశ్చాత్తాపం, బాధ, ఎదుటివారికి చెప్పకుండా దాచిపెడుతున్నాననే తెలియని వ్యధను పలికిస్తాడు.

బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌ ... తండ్రిగా తాను చేయాల్సిన పని చేశాను...దానికి ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేదని అర్ధం వచ్చేలా ఎక్స్‌ప్రెషన్‌ ఉంటుంది. కన్నడ యాక్టర్‌ రవిచంద్రన్‌ క్లైమాక్స్‌ సీన్‌ని చాలా సాధారణంగా చేస్తాడు. ఇక్కడ కుటుంబాన్ని కాపాడుకోవడం తన బాధ్యతగా, దానికోసం ఎంతదూరం వెళ్తాను అని చెప్పేవిధంగా ఉంటుంది అతని యాక్టింగ్‌. పైగా కుటుంబాన్ని కాపాడుకున్నానని గర్వంగా చెబుతాడు. ఇలా ఒక్కో భాషలో ఒక్కో యాక్టర్‌ ఒక్కో విధంగా సీన్‌ని అర్ధం చేసుకొని నటించారు. ఒకటే సీన్‌, కానీ దానిని అర్ధం చేసుకొని నటించిన విధానం వేరువేరుగా ఉంటుంది. ఎక్కడా కూడా నటిస్తున్న ఫీలింగ్‌ రాదు సాధారణ ప్రేక్షకుడికి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story