Dustin Hoffman Movie Role: సినిమాలో పాత్ర కోసం ఆ స్టార్‌ హీరో ఏం చేశాడో తెలుసా? దర్శకుడికి మైండ్‌ బ్లాక్‌

హాలీవుడ్ స్టార్ డస్టిన్ హాఫ్‌మన్ పాత్ర కోసం భిక్షగాడి వేషంలో వచ్చి దర్శకుడినే ఆశ్చర్యపరిచాడు. 'మిడ్‌నైట్ కౌబాయ్' సినిమా వెనుక ఉన్న ఆసక్తికర సంఘటన, మూడు ఆస్కార్ అవార్డుల చరిత్రను తెలుసుకుందాం.

Balachander
Published on: 3 July 2026 9:22 AM IST
Dustin Hoffman Movie Role: సినిమాలో పాత్ర కోసం ఆ స్టార్‌ హీరో ఏం చేశాడో తెలుసా?  దర్శకుడికి మైండ్‌ బ్లాక్‌
X

Dustin Hoffman Movie Role: సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు తమ పాత్రల కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. కేవలం డైలాగులు చెప్పి మేకప్ వేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక అద్భుతమైన, ఇప్పటికీ హాలీవుడ్‌లో ఒక సంచలనంగా చెప్పుకునే క్రేజీ ఇన్సిడెంట్ 1968లో జరిగింది. ఒక అగ్ర దర్శకుడు తన సినిమాలోని భిక్షగాడి పాత్ర కోసం ఒక స్టార్ హీరోతో మాట్లాడదామని న్యూయార్క్ వీధి చివర అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కానీ అక్కడికి వచ్చిన దర్శకుడికి ఆ స్టార్ హీరో కనిపించలేదు సరే కదా.. ఒక మురికి బట్టలు వేసుకున్న భిక్షగాడు వచ్చి విపరీతంగా విసిగించాడు. ఆ తర్వాత అసలు నిజం తెలిసి ఆ దర్శకుడి మైండ్ బ్లాక్ అయిపోయింది! ఎందుకంటే ఆ భిక్షగాడు మరెవరో కాదు.. స్వయంగా ఆ స్టార్ హీరోనే!

ఆ రోజు న్యూయార్క్ వీధిలో ఏం జరిగింది?

1968వ సంవత్సరంలో ప్రసిద్ధ దర్శకుడు జాన్ ష్లేసింజర్ తన కొత్త సినిమాలోని ఒక కీలకమైన భిక్షగాడి పాత్ర కోసం అప్పటి స్టార్ నటుడు డస్టిన్ హాఫ్‌మన్‌ను సంప్రదించారు. ఆ పాత్ర గురించి చర్చించడానికి న్యూయార్క్‌లోని ఒక వీధి కూడలిలో కలుద్దామని ఇద్దరూ అనుకున్నారు. ముందుగా అనుకున్న నిర్ణీత సమయానికి దర్శకుడు జాన్ అక్కడికి చేరుకున్నారు. ఎంతసేపు ఎదురుచూసినా డస్టిన్ హాఫ్‌మన్ రాలేదు. దీంతో జాన్‌కు విపరీతమైన కోపం వచ్చింది. దీనికి తోడు, ఆ వీధి చివర ఉన్న ఒక మురికి భిక్షగాడు జాన్ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ పదే పదే వెంటపడుతూ, తీవ్రంగా విసిగించసాగాడు. ఆ విసుగులో దర్శకుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు.

ఫోన్ కాల్‌తో తేలిన అసలు గుట్టు!

తర్వాత దర్శకుడు జాన్ తీవ్ర ఆగ్రహంతో డస్టిన్ హాఫ్‌మన్‌కు ఫోన్ చేసి, కలుద్దామని చెప్పి నన్ను అంతసేపు నిలబెడతావా? నీకు కనీస మర్యాద లేదా? అంటూ గట్టిగా అరిచారు. దానికి డస్టిన్ చాలా ప్రశాంతంగా.. సార్, నేను కరెక్ట్ టైమ్‌కి అక్కడికి వచ్చాను, మీ పక్కనే ఉన్నాను...అని సమాధానం ఇచ్చాడు. నాతో జోకులు వేస్తున్నావా? అక్కడ నువ్వు ఎక్కడున్నావ్? అని దర్శకుడు మరింత కోపడ్డారు. డస్టిన్‌ నవ్వుతూ... ఆ వీధి కూడలిలో మిమ్మల్ని డబ్బుల కోసం వెంటపడి విసిగించిన ఆ భిక్షగాడిని నేనే! అని చెప్పాడు. ఆ మాట వినగానే దర్శకుడు జాన్ షాక్‌తో నోరెళ్లబెట్టారు. ఆ పాత్రలో డస్టిన్ లీనమైన తీరుకు, ఆయన వేసిన మేకప్‌కు దర్శకుడు ఫిదా అయిపోయారు.

మూడు ఆస్కార్ అవార్డుల చరిత్ర

డస్టిన్ హాఫ్‌మన్ అంతలా ప్రాణం పెట్టి చేసిన ఆ పాత్ర మరేదో కాదు.. హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ 'మిడ్‌నైట్ కౌబాయ్' లోని 'రాట్సో' రిజ్జో పాత్ర. పాత్ర స్వభావాన్ని లైవ్‌గా టెస్ట్ చేయడం కోసమే ఆయన అలా భిక్షగాడి వేషంలో వచ్చి డైరెక్టర్‌నే మోసం చేశారు. ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా, ఏకంగా మూడు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని సినిమా చరిత్రలో నిలిచిపోయింది. కథ నచ్చితే చాలు.. తాము పోషించే పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే డస్టిన్ హాఫ్‌మన్ లాంటి నటులు ఉన్నారు కాబట్టే, అప్పట్లోనే అలాంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story